విలక్షణ నటుడు మోహన్‌బాబు. దాదాపు ఆయన తన సినీ కెరీర్‌లో చేయని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆయన నుండి ప్రధాన పాత్రలో సినిమా వస్తుందంటే, అదీ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత..అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయన ప్రధాన పాత్రలో సినిమా ఎప్పుడొచ్చినా, అది ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించేలానే ఉంటుంది. తాజాగా మోహన్‌బాబు లీడ్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం 'గాయత్రి'. 'పెదరాయుడు' సినిమాలో రజనీకాంత్ పాత్ర తాలూకు అప్పియరెన్స్ ఈ సినిమాలో మోహన్‌బాబులో కనిపిస్తోంది. ఆ పాత్రకి ఉన్నంత డెప్త్ 'గాయత్రి'లో మోహన్‌బాబు పాత్రలో ఉండనుందట.
విష్ణు, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమాలో. నిఖిలా విమల్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. 'గాయత్రి' సినిమా అంటే ఇదేదో మామూలు కమర్షియల్ సినిమా అనుకుంటే పొరపాటే. ఈ సినిమా ద్వారా సొసైటీకి బలమైన మెసేజ్ ఏదో ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే మోహన్‌బాబు ఈ సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది. మోహన్‌బాబు లుక్‌ని పరిచయం చేస్తూ, 'అప్పుడు రాముడు చేసింది తప్పు అయితే నేను చేసింది కూడా తప్పే' అనే కొటేషన్‌తో పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే శ్రియ లుక్‌ని పరిచయం చేస్తూ, 'నేనేదనుకుంటే అది చెప్పడం నాకలవాటు' అని పోస్టర్ విడుదల చేశారు.
అన్నింటికీ మించి, 'ఆడపిల్ల పుట్టిందంటే, మన అమ్మే మళ్లీ పుట్టినట్లు..' అంటూ నిఖిలా విమల్ పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు. ఇదే పోస్టర్‌లో 'నేనీ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే, కారణం మా నాన్న' అంటూ పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే, మహిళల పట్ల సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలు వీటన్నింటి పైనా ఈ సినిమాని ఓ అస్త్రంలా ప్రయోగించనున్నారేమో అనిపిస్తోంది. మదన్ దర్శకత్వంలో ఈ సినిమాని మోహన్‌బాబు తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.