ఈ సంక్రాంతికి విడుదలైన రెండు సినిమాల మధ్య కలక్షన్ల వార్ నడిచిన సంగతి తెలిసిందే. మా సినిమా ఆల్ టైమ్ హిట్టు, అంటే మాదే ఆల్ టైమ్ హిట్టు అంటూ... పోటా పోటీగా పోస్టర్లు విడుదల చేసుకున్నారు. ఈ ఇద్దరిలో ఎవరి లెక్కలు నమ్మాలో ప్రేక్షకులకు, చిత్రసీమకు సైతం అర్థం కాలేదు. నిజానికి నిర్మాతలు ప్రకటించే లెక్కల్లో నిజాయతీ కనిపించదు. కేవలం రికార్డుల గోల కోసమే.. నోటికొచ్చిన అంకెల్ని చెబుతారన్న విమర్శ ఉంది. ఈ వసూళ్లు నమ్మలేమని గతంలో కొంతమంది నిర్మాతలే బాహాటంగా ప్రకటించేశారు. అయినా సరే, రికార్డుల గోల ఆగడం లేదు. దాంతో హీరోల మధ్య, ఫ్యాన్స్ మధ్య , నిర్మాతల మధ్య గొడవలు మొదలైపోతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలని నిర్మాతలు కలిసికట్టుగా ఓ నిర్ణయం తీసుకున్నారు.
నిర్మాతల కోసం, వాళ్ల సంక్షేమం కోసం ప్రొడ్యూసర్ గిల్డ్ పనిచేస్తోంది. చిత్రసీమకు చెందిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ గిల్డ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కలక్షన్ల లెక్కలపై కూడా ఈ గిల్డ్ ఇప్పుడు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. నిర్మాతలు ఇక మీదట తమ సినిమా వసూళ్ల లెక్కలు ఎవరికి వాళ్లు ప్రకటించుకోకూడదని గిల్డ్ ఓ నియమం విధించింది. ఒకవేళ సినిమా వసూళ్ల వివరాలు ప్రకటించుకోవాల్సివస్తే అందుకు గిల్డ్ అనుమతి తీసుకోవాలి. గిల్డ్ దగ్గర ఏ సినిమాకి ఎంత వచ్చింది? అనే లెక్క ఉంటుంది. ఆ వివరాలే ప్రకటించుకోవాలి. ఇలా చేస్తే ఫేక్ కలక్షన్ల గొడవ తగ్గుతందున్నది చిత్రసీమ అభిప్రాయం. అయితే ఈ నిబంధనకు మిగిలిన నిర్మాతలు ఏమంటారు? దానికి హీరోల సహకారం ఉంటుందా? అనేది అనుమానం. పైగా గిల్డ్‌లో ఉన్నవాళ్లంతా పెద్ద నిర్మాతలే. వాళ్ల సినిమాలే అధికంగా బయటకు వస్తుంటాయి. రికార్డు వసూళ్ల గొడవలు కూడా వాళ్లమధ్యే. మరి వాళ్లు సరైన అంకెలే చెబుతారా? అనేది మరో పెద్ద అనుమానం. మొత్తానికి ఇది మంచి అడుగే. గిల్డ్ నిస్పక్షపాతంగా ఉంటే తప్పకుండా ఫేక్ వసూళ్ల బెడద తప్పుతుంది.