పవన్ కల్యాణ్ - రానా చేస్తున్న మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. మలయాళ సూపర్ హిట్ మూవీ `అయ్యప్పయునుమ్ కోషియమ్`కి ఇది రీమేక్. టైటిల్ పవన్ అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అయితే కొంతమంది మాత్రం `ఇది పవన్ సినిమానా? మల్టీస్లారరా` అని ప్రశ్నించడం మొదలెట్టారు. మాతృకలో ఇద్దరు హీరోల పాత్రలకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఇద్దరి పేర్లూ కలిసొచ్చేలా `అయ్యప్పయునుమ్ కోషియమ్` అనే పేరు పెట్టారు. తెలుగులో అలా కాదు. కేవలం పవన్ పేరుతోనే టైటిల్ వచ్చింది.
అయితే `భీమ్లా నాయక్` గ్లిమ్స్ వచ్చినప్పుడు పవన్ పాత్రని పరిచయం చేస్తున్నారు కాబట్టి... అలా వదిలారని, అది టైటిల్ కాదని, రానా పాత్రకు సంబంధించిన టీజర్ కూడా వదిలాక.. అప్పుడు అసలైన టైటిల్ ని రివీల్ చేస్తారని అనుకున్నారు. కానీ... అందులోనూ వాస్తవం లేదని తేలిపోయింది. ఈనెల 20న డానియేల్ శేఖర్ పాత్రని రివీల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. టైటిల్ మాత్రం `భీమ్లా నాయక్` అనే ఉంచింది. అంటే టైటిల్ లో ఎలాంటి మార్పు లేదన్నమాట. మరి ఇప్పుడు విమర్శకులు ఏమంటారో చూడాలి. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తున్న సంగతి తెలిసిందే.