మలయాళ సినిమాలు రొటీన్ కమర్షియల్ ఫార్ములాకి భిన్నంగా ఉంటాయి. కానీ 'ఒరు అదర్ లవ్' సినిమా విషయంలో దర్శకుడు ఒమర్ లులు తప్పులో కాలేశారు. ముందు అనుకున్నట్లుగా కాకుండా, మధ్యలో కథలో మార్పులు చేశారు. అది కూడా కమర్షియల్ కక్కుర్తితో. అందుకే ఆ సినిమా దారుణంగా దెబ్బ తినేసింది.
అనుకోకుండా వైరల్ అయిన 'కన్ను గీటే' సన్నివేశం, ఆ కారణంగా సెకండ్ హీరోయిన్‌ని తీసుకొచ్చి మెయిన్ హీరోయిన్‌ని చేసేయడం.. ఇవన్నీ సినిమాకి శాపంగా మారాయి. దర్శకుడు ఒమర్ లులు కూడా చాలా బాధపడుతున్నాడట. సినిమా ఇంతలా తనకు చెడ్డ పేరు తెస్తుందని ఆయన ఊహించలేదు. మరోపక్క అసలు హీరోయిన్ అయిన నౌరీన్ షెరీఫ్ కూడా తనకు జరిగిన అన్యాయంపై పెదవి విప్పింది.
ఇలాంటి పరిస్థితి ఏ హీరోయిన్‌కీ రాకూడదనీ, పూర్తిగా ఈ విషయంలో తను దర్శకున్ని తప్పు పట్టలేననీ షెరీఫ్ చెప్పింది. మరోపక్క అంచనాల్ని అందుకోలేక చతికిలపడ్డామని, అంతకు మించి తను ఈ సినిమాపై ఏ కామెంట్లు చేయలేనని ప్రియా ప్రకాష్ వారియర్ వాపోతోంది. సినిమా రిలీజ్‌కి ముందు తనను ఆకాశానికెత్తేసిన వారంతా ఇప్పుడు తనను తప్పు పడుతుండడంతో చాలా బాధగా ఉందని చెప్పిందామె.