తారాగణం: నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, రానా దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్, సుమంత్ తదితరులు
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
ఎడిటర్: అర్రం. రామకృష్ణ
సినిమాటోగ్రఫీ: వి. ఎస్. జ్ఞాన శేఖర్
నిర్మాతలు: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
విడుదల: ఫిబ్రవరి 22, 2019
రేటింగ్: 2.75/ 5
తెలుగునాట బయోపిక్‌ల పరంపరకు ఊపునీ, ఉత్సాహాన్నీ తీసుకొచ్చిన సినిమా 'ఎన్టీఆర్'. సావిత్రి కథ `మహానటి`గా విజయవంతమవ్వడంతో ఎన్టీఆర్ బయోపిక్ అంతకు మించిన ఆదరణ సాధిస్తుందని అంతా ఆశించారు. దానికి బలమైన కారణాలూ ఉన్నాయి. ఎన్టీఆర్ పాత్రని ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ పోషించడం, విద్యాబాలన్, రానా, కల్యాణ్‌రామ్, సుమంత్ లాంటి స్టార్లు ఈ సినిమాకి అండగా ఉండడం, చిన్న చిన్న పాత్రల్లోనూ పెద్ద పెద్ద పేరున్న నటీనటులు కనిపించడంతో - `ఎన్టీఆర్` స్టార్ డమ్ మరింతగా పెరిగింది.
అయితే సంక్రాంతి సందర్భంగా విడుదలైన `కథానాయకుడు` అంతగా ఆడలేదు. దాంతో... ఎన్టీఆర్ బయోపిక్ ఓ వృధా ప్రయత్నంగా మిగిలిపోతుందేమో అనే అనుమానాలు వ్యాపించాయి. కానీ చిత్రబృందం మాత్రం రెండో భాగం `మహానాయకుడు`పై అచంచల విశ్వాసాన్ని పెట్టుకుంది. మరి ఆ నమ్మకాలు ఏమయ్యాయి? ఎన్టీఆర్ మహానాయకుడు.. `కథానాయకుడు` వైఫల్యాల్ని అధిగమించిందా? లేదంటే... ఆ పరాజయాన్ని కొనసాగించిందా?
కథ
ఎన్టీఆర్ జీవితంలోని కీలకమైన అంకం.. ఆయన రాజకీయ ప్రస్థానం. తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ గల్లీలో వినిపించిన ఎన్టీఆర్ ప్రస్థానం నిజంగానే అపూర్వమైన ఘట్టం. ఇదంతా 'మహానాయకుడు'లో కనిపిస్తుంది. కథానాయకుడిగా ఆయన విజయయాత్ర `కథానాయకుడు` సినిమాలో చూపించారు. ఈసారి ఆయన రాజకీయ ప్రయాణం కనిపించబోతోంది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి- కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యాక.
ఆయనకు ఎదురైన పరిస్థితులు, నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్‌ని పదవీత్యుతుడు చేయడానికి పన్నిన కుట్ర, అందులోంచి బయటపడిన విధానం ఇవన్నీ `మహానాయకుడు`లో చూడొచ్చు. తొలిసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కరరావు కుట్రకు బలై, సీఎం కుర్చీ నుంచి దిగిపోవడం, మళ్లీ ప్రజా బలం కూడగట్టుకుని, ఢిల్లీ లో ప్రకంపనాలు సృష్టించి, మళ్లీ సీఎం కూర్చీలో కూర్చోవవడమే 'మహానాయకుడు' ప్రస్థానం.
నటీనటుల పనితీరు..
ఎన్టీఆర్ ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. నందమూరి తారక రామారావుగా, ఆయన వారసుడే ఈ పాత్ర చేశాడు కాబట్టి.. అభిమానుల నుంచి పెద్దగా ఫిర్యాదులేం రావు. అలాగని బాలయ్య తక్కువ చేశాడని కాదు. తన పాత్రకు నూటికి నూరుపాళ్లూ న్యాయం చేశాడు. కానీ కొన్ని సార్లు.. ఎన్టీఆర్ కాదు, సాక్షాత్తూ బాలయ్యే కనిపిస్తాడు.
అలాంటప్పుడు పాత్రని ఓన్ చేసుకోవడం కష్టం అవుతుంటుంది. విద్యాబాలన్ మరోసారి తన అనుభవాన్ని దట్టించింది. భావోద్వేగ భరితమైన సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది. కల్యాణ్ రామ్‌కి మరోసారి తక్కువ సన్నివేశాలే లభించాయి. సుమంత్ అయితే ఒకే ఒక్క సన్నివేశానికి పరిమితం అయ్యాడు. అన్నింటికంటే ఎక్కువ మార్కులు రానాకి పడతాయి. చంద్రబాబు నాయుడుగా ఆయన హావభావాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.
విశ్లేషణ
`ఎన్టీఆర్`లో తొలి భాగం `కథానాయకుడు` తీస్తున్నప్పుడు క్రిష్ కి ఎలాంటి సమస్యలూ ఎదురుకాకపోవొచ్చు. ఎందుకంటే.. కథానాయకుడిగా ఎన్టీఆర్ ప్రస్థానంలో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవు. కొంత మెలో డ్రామా, ఇంకొన్ని కల్పించుకున్న సన్నివేశాలు మినహాయిస్తే... బండి సాఫీగా నడిచిపోయింది. కానీ `మహానాయకుడు` అలా కాదు. ఇందులో వివాదాస్పదమైన అంశాలు చాలా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎపిసోడ్‌ని ఎలా చూపిస్తారు? వైశ్రాయ్ ఉదంతం, లక్ష్మీ పార్వతి ప్రమేయం ఇవన్నీ ఉంటాయా? లేదా? అనే అనుమానాలు వ్యాపించాయి. కానీ.. క్రిష్ ఇక్కడ తెలివిగా ఈ కథని బసవతారకం కోణంలో చెప్పడం మొదలెట్టాడు. బసవతారకం మరణంతో కథ పూర్తవుతుంది. అంటే... వైశ్రాయ్ ఘట్టం, చంద్రబాబు వెన్నుపోటు, లక్ష్మీ పార్వతితో రెండో వివాహం.. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. మరి... `మహానాయకుడు`లో డ్రామా ఎక్కడ ఉంటుంది? మహానాయకుడిగా ఎన్టీఆర్ కి ఛాలెంజ్ విసిరిన సందర్భాలేంటి?
ఇక్కడే నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్‌ని తీసుకున్నాడు క్రిష్. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయి, ఆ వెంటనే నాదెండ్ల భాస్కరరావు కుట్రలకు బలై... ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సివచ్చింది. తిరిగి.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారన్నదానిపైనే క్రిష్ ఫోకస్ చేశాడు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాత్రని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ పై చంద్రబాబు పోటీ చేసి ఓడిపోయిన వైనం గుర్తుండే ఉంటుంది. దాన్ని కూడా ఇందులో చూపించారు. కాకపోతే అక్కడ కూడా చంద్రబాబుని `కాంగ్రెస్ పార్టీకి విధేయుడైన కార్యకర్త`గా చూపించే ప్రయత్నమే కనిపించింది.
1983లో ఎన్టీఆర్ సీఎం అయ్యాక.. మామ పార్టీలో చేరిపోయాడు బాబు. కానీ.. ఈ సినిమాలో మాత్రం `మీలాంటి వాళ్లు పార్టీకి అవసరం` అంటూ ఎన్టీఆర్ స్వయంగా ఆహ్వానించినట్టు చిత్రీకరించారు. అన్నింటికంటే ముఖ్యంగా నాదెండ్ల భాస్కరావు కుట్ర చేసినప్పుడు, మావయ్యని అనుక్షణం అప్రమత్తం చేసే అల్లుడిగా చంద్రబాబు నాయుడు పాత్రని డిజైన్ చేశారు. మరోసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు, చూపించిన ధైర్యసాహసాలు కారణం అన్నట్టు చిత్రించారు. ఇలాంటి సన్నివేశాల్లో అతి కనిపిస్తుంది.
అయితే ఈ కథని బసవతారం కథతో ముడిపెట్టడం తెలివైన ఆలోచన. ఆమెతో ఎన్టీఆర్‌కి ఉన్న అనుబంధం.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా చూపించాడు. ఎన్టీఆర్‌ని కథానాయకుడుగా, రాజకీయ నాయకుడిగా ఆరాధించిన ఆయన అభిమానులకు ఆయనలో ఓ ఉత్తమ భర్త ఉన్నాడన్న విషయాన్ని తేటతెల్లం చేశాడు. దర్శకుడు క్రిష్ సినిమాటిక్ లిబర్టీ చాలానే తీసుకున్నాడని అర్థమవుతూనే ఉంది. అయితే ఆయా సన్నివేశాల్ని ఉత్కంఠ భరితంగా, సినిమాటిక్‌గా తెరకెక్కించడానికి ఆ మాత్రం స్వేచ్ఛ అవసరం అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం
`రుషివో మహర్షివో..` పాట వస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుస్తాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అదో ట్రీట్. మిగిలినవన్నీ నేపథ్య గీతాలే. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. బుర్రా సంభాషణలు అక్కడక్కడ చప్పట్లు కొట్టిస్తాయి. క్రిష్.. ఎన్టీఆర్ కథని వివాదాలకు దూరంగా తెరకెక్కించడంలో సఫలీకృతమయ్యాడు. ఎన్టీఆర్ మరణం, ఆయన చివరి రోజులు చూపించకపోవడం లోటుగా అనిపిస్తుంది.
* ప్లస్ పాయింట్స్
+ ఎన్టీఆర్‌గా బాలయ్య
+ తారకంగా విద్యాబాలన్
+ నారాగా రానా
* మైనస్ పాయింట్స్
- చంద్రబాబుని హీరోగా చూపించే ప్రయత్నం
* ఫైనల్ వర్డిక్ట్: సత్యాలు దాచిన బయోపిక్
- రివ్యూ రాసింది శ్రీ.