తెలుగు సినిమాకి సంక్రాంతి తర్వాత అతి పెద్ద పండగ విజయ దశమి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతితో పోల్చితే దసరాకి సెలవులు కాస్త ఎక్కువే. తెలంగాణలో ఇంకా ఎక్కువే. సెలవుల సీజన్‌ని క్యాష్ చేసుకోవడానికి తెలుగు సినిమా ముస్తాబవుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత', మాస్ మహారాజా రవితేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ', ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'హలో గురూ ప్రేమ కోసమే', యంగ్ సూపర్‌స్టార్ విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' చిత్రాలు అక్టోర్‌లో ప్రేక్షకుల్ని అలరించనున్న ప్రముఖ సినిమాలు. అక్టోబర్ మొదటి వారం నుండి, చివరి వారం వరకూ సినిమాల సందడే సందడి.
పైన పేర్కొన్న నాలుగు సినిమాలే కాకుండా ఇంకో డజను సినిమాల దాకా ఈ సీజన్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. విశాల్ నటిస్తున్న 'పందెంకోడి 2' వంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఈ రేసులో తలబడతాయి. 'గీత గోవిందం' సినిమాతో గ్రాస్ పరంగా 100 కోట్ల క్లబ్‌లోకి, షేర్ పరంగా 60 కోట్ల క్లబ్‌లోకి చేరిన విజయ్ దేవరకొండ అక్టోబర్ బరిలో ముఖ్యమైన పోటీదారుడు.
ఇక అక్టోబర్ సీజన్‌కే హైలైట్ కాబోతున్న 'అరవింద సమేత..' సినిమాతో 100 కోట్ల షేర్ కొల్లగొట్టాలనే కసితో ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని రవితేజ, రామ్ కూడా ఉవ్విళ్లూరుతున్నారు. సో ఈ అక్టోబర్ ఫైట్ బీభత్సమే కాబోతోంది. అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలని తెలుగు సినిమా బాక్సాఫీస్ కళకళలాడాలని ఆశిద్దాం.!