ఈ దశాబ్దంలోనే అత్యంత ఘోర పరాజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది ఎన్టీఆర్ బయోపిక్. తొలి భాగంతో బయ్యర్లు రూ.50 కోట్లు నష్టపోయారు. రెండో భాగంతో నష్టాల్ని పూడ్చుకోవాలనుకుంటే.. ఇప్పుడు థియేటర్ అద్దెలు కూడా ఎదురు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రూపాయి పెట్టుబడి పెడితే పావలా కూడా తిరిగి రాకపోవడంతో బయ్యర్లు పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయారు.
ఈ నష్టభారాన్ని తమ బాలయ్యే తగ్గిస్తాడన్నది బయ్యర్ల నమ్మకం. 'కథానాయకుడు' ఫ్లాప్ అయినప్పుడు బయ్యన్లను పిలిచి 33 శాతం నష్టాల్ని తిరిగి చెల్లించాడు బాలకృష్ణ. అంతేకాదు..'మహానాయకుడు'ని కూడా ఫ్రీగా ఇచ్చేశాడు. మహానాయకుడు వసూళ్లలో 40 శాతం ఉంచుకుని, మిగిలినది తిరిగి ఇవ్వాలన్నాడు.
కానీ... మహానాయకుడు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో బయ్యర్లు కూడగట్టుకున్నది ఏదీ లేదు. దాంతో బాలయ్య తిరిగి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లిస్తాడేమో అన్నది వాళ్ల ఆశ. బాలకృష్ణ కూడా బయ్యర్లను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఉన్నాడట. అతి త్వరలో బాలయ్య నుంచి కబురు అందే అవకాశాలున్నాయని టాక్. మరి.. ఈసారి నష్టపరిహారం ఏ మేరకు ఉంటుందో చూడాలి.