తొలిరోజు 1.6 కోట్ల షేర్ తెచ్చుకున్న 'ఎన్టీఆర్- మహానాయకుడు' రెండో రోజు మరింత డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. శనివారం కేవలం 47 లక్షలు మాత్రమే వసూలు చేసి బయ్యర్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఆదివారం కూడా 'మహానాయకుడు' పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. మూడు రోజులకు కలిపి ప్రపంచ వ్యక్తంగా కేవలం 3 కోట్ల 40 లక్షల షేర్ తెచ్చుకుంది.
ఓ స్టార్ హీరో సినిమాకి తొలి వారంతంలో దక్కిన అతి స్వల్పమైన వసూళ్లు ఇవి. తొలి భాగం 'కథానాయకుడు' రూ.20 కోట్లు వసూలు చేసింది. ఆ నష్టాల్ని పూడ్చడానికి బాలకృష్ణ ముందుకొచ్చి, మహానాయకుడు వసూళ్లలో 40 శాతం బయ్యర్లకే కేటాయించాడు. అంటే ఈ 3.4 కోట్లలో బయ్యర్ల వాటా 1.5 కోట్లు కూడా లేదు. వాళ్లు తేరుకోవాలంటే... ఇలాంటి సినిమాలు మరో పది తీసి ఫ్రీగా ఇవ్వాల్సిందే.
నైజాంలో తొలి మూడు రోజులకు 64 లక్షలు చేసింది మహానాయకుడు. ఆ తరువాతి స్థానం గుంటూరుది. అక్కడ 62 లక్షలు వచ్చాయి. ఏ ఏరియాలోనూ కోటి రూపాయల మార్కుకి అతి సమీపంలో కూడా రాలేకపోయింది. ఓవర్సీస్‌లో అయితే తొలిరోజే థియేటర్లు ఖాళీగా కనిపించాయి. వారాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే సోమవారం నుంచి చెప్పనవసరం లేదు. థియేటర్లకు అద్దెలు ఎదురు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసినట్టే.