దాదాపు నెల రోజుల వ్యవధిలో 'ఎన్టీఆర్'పై రెండు సినిమాలు రాబోతున్నాయి. ఒకటి రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కాగా, మరోటి బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'మహానాయకుడు'. ఎన్టీఆర్ కథానాయకుడు డిస్ట్రిబ్యూటర్సే 'మహానాయకుడు'ని కూడా రిలీజ్ చేస్తున్నారు.
'కథానాయకుడు' మిగిల్చిన నిరాశతో 'మహానాయకుడు'పై బాలయ్య ఒకింత ఉదారత చూపినా, నష్టాల నుండి డిస్ట్రిబ్యూటర్స్ తేరుకునే పరిస్థితి మాత్రం కనిపిచడం లేదు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు ఓ ఆలోచనకు వచ్చారట. ఎలాగూ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' త్వరలో వచ్చేస్తోంది. కనుక ఆ హక్కుల్ని కూడా తామే పొందగలిగితే కాస్త సేఫ్ అవ్వొచ్చని అనుకుంటున్నారట.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' మరీ మహానాయకుడు, కథానాయకుడులాగా భారీ రేట్లు ఉండకపోవచ్చు. దాంతో పాటు మినిమమ్ గ్యారంటీ అనే అభిప్రాయం సినిమాపై బలంగా ఏర్పడింది. ఎలక్షన్స్ ముందు ఈక్వేషన్స్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కే ఎక్కువగా కలిసొచ్చే అవకాశాలున్నాయని నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఆర్జీవీతో సంప్రదింపులు కూడా మొదలయ్యాయనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్.