విశ్వ విఖ్యాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత కథ ఆధారంగా నిర్మించబడిన చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'. అందులో మొదటి భాగం 'కథానాయకుడు' నిన్న విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో సక్సెస్ పథంలో నడుస్తుంది. నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటించి అలరిస్తున్న ఈ చిత్రం మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఆనందంలో ఉన్న 'ఎన్టీఆర్' బృందానికి అనుకోని విధంగా పెద్ద షాక్ తగిలింది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్ లైన్ లో పైరసీ లీక్ అవ్వటం ద్వారా నిర్మాతలు ఊహించని షాక్ కి గురయ్యారు.
ఇటీవలే రజినీకాంత్ నటించిన '2.ఓ', జూ. ఎన్టీఆర్ 'అరవింద సమేత' వంటి చిత్రాలను లీక్ చేసిన పైరసీ భూతం 'తమిళ్ రాకర్స్' వాళ్లే ఇప్పుడు ఈ సినిమాని కూడా లీక్ చేసారు. అసలే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి గట్టి పోటీ ఉంది. మొదటి రోజు బాగానే వసూళ్లు వచ్చిన రెండో రోజు రజినీకాంత్ నటించిన 'పేట' సినిమా విడుదలైంది. మళ్ళీ ఆ వెంటనే 'వినయ విధేయ రామ' మరియు 'ఎఫ్ 2' చిత్రాలు విడుదలకానున్నాయి.
ఇప్పటికే, ఈ టెన్సన్స్ లో ఉన్న 'ఎన్టీఆర్' చిత్ర బృందానికి నెట్ లో సినిమా లీక్ అన్న వార్త ఒక విషాదంగా మారింది. గతంలో దాదాపు మద్రాస్ హైకోర్ట్ 12వేలకు పైగా పైరసీ వెబ్ సైట్లను నిషేదించింది. సినీ అభిమానులు, చాలామంది నటీనటులు కూడా తమిళ్ రాకర్స్ సైట్ ని బ్లాక్ చేసారు. అయినా సరే ఇవేవీ దానిపై ప్రభావం చూపించలేకపోయాయి. ప్రస్తుతం.. ఎన్టీఆర్ చిత్ర బృందం ఆన్ లైన్ లో లీక్ అయిన సినిమా లింక్స్ డిలీట్ చేయించే పనిలో ఉన్నారు.