కథానాయకుడు కంటే ఘోరమైన పరాజయం మూటగట్టుకునే దిశగా మహానాయకుడు వడి వడిగా అడుగులేస్తోంది. తొలి వారంతంలో రూ.5 కోట్లు కూడా దక్కించుకోలేని ఈ ఎన్టీఆర్ బయోపిక్‌కి భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఆ పరాజయ భారాన్ని కొద్దిగా తగ్గించేందుకు `డ్వాక్రా` మహిళలు ముందుకొచ్చారు. ఈ సినిమాని డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించడానికి తెలుగు దేశం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. అందులో భాగంగా గుంటూరులో మహానాయకుడుని డ్వాక్రా మహిళల కోసం ప్రదర్శించారు.
దాంతో.. గుంటూరు మహానాయకుడు వసూళ్లకు కాస్త ఊపొచ్చింది. సోమవారం గుంటూరు వసూళ్ల 1.78 లక్షలు మాత్రమే. మంగళవారం అది 12 లక్షలకు చేరింది. బుధవారం 17 లక్షల వరకూ వెళ్లింది. మిగిలిన ఏరియాల్లోనూ ఇలానే ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ `ఉచిత` ప్రదర్శనల వల్ల టీడీపీ పార్టీకి ఎంత లాభమో తెలీదు గానీ, భారీ నష్టాల దిశగా సాగుతున్న మహానాయకుడుకి కాస్త ఉపశమనం లభించిందనే చెప్పాలి.