స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను 'ఎన్‌టిఆర్ కథానాయకుడు', 'ఎన్‌టిఆర్ మహానాయకుడు'గా క్రిష్ తెరకెక్కిస్తోంటే, ఆ జీవిత చరిత్రలోని అతి ముఖ్యమైన భాగాన్ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ ప్రజాదరణ పొందుతుంది? అనే సంగతి పక్కన పెడితే, నిన్ననే స్వర్గీయ ఎన్టీఆర్‌కి సంబంధించి రెండు కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి 'ఎన్‌టిఆర్ బయోపిక్' పాటల విడుదల, ట్రైలర్ విడుదల జరిగాయి. మరొకటి, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నుంచి 'వెన్నుపోటు' ఆడియో సింగిల్ విడుదల కావడం.
ఆడియో సింగిల్ నిండా ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలే ఎక్కువగా కన్పించాయి. అక్కడక్కడా లక్ష్మీపార్వతి, మరికొందరు ప్రముఖుల ఫొటోలూ పొందుపర్చారు. పాట విడుదలైన క్షణాల్లోనే బీభత్సమైన వ్యూస్ వచ్చాయి. ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందంటే కారణం ఆనాటి ఆ 'రాజకీయ వెన్నుపోటు' ఘటనే.
చంద్రబాబుని వెన్నుపోటుదారుడిగా చూపించడమే లక్ష్యంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తెరకెక్కుతోందన్నది ఓపెన్ సీక్రెట్. దాంతో, స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి (రెండో భార్య) చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ ఆత్మకు ఇప్పటికి శాంతి చేకూరుతోందని ఆమె చెప్పారు. అయితే స్వర్గీయ ఎన్టీఆర్ మొదటి భార్య దివంగత బసవతారకం పాత్ర పోషిస్తోన్న విద్యాబాలన్, 'ఎన్‌టిఆర్ బయోపిక్' ఈవెంట్‌లో సందడి చేయడం మరో విశేషంగా చెప్పుకోవాలి. ఆమెకు తెలుగులో ఇదే తొలి సినిమా.