సినిమా నిర్మాణం అనేది రిస్కుతో కూడిన వ్యాపారం. పారితోషికాలు ఇచ్చి, ప్రొడక్షన్ కోసం భారీగా ఖర్చు పెట్టి సినిమా తీస్తే... ఆడుతుందో, లేదో చెప్పలేం. అంత కష్టపడి సినిమా తీసినా - కనీసం విడుదల అవుతుందా, లేదా? అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి వాతారణంలో నిర్మాతలపై వీలైనంత భారం తగ్గించడానికి ప్రయత్నించాలి. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' టీమ్ అదే చేసింది.
ఈ సినిమా కోసం ఓ వినూత్నమైన ప్లాన్ వేసింది చిత్రబృందం. దాంతో నిర్మాతపై భారం సగానికి సగం తగ్గిపోయింది. ఆది కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సాయికిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నాడు. అబ్బూరి రవి, సషా ఛెట్రి, కార్తిక్‌రాజు, నిత్యానరేష్, పార్వతీశం ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, నటీనటులు పారితోషికం తీసుకోలేదు.
తమ పారితోషికాన్ని ఈ సినిమా కోసం పెట్టుబడిగా పెట్టారు. సినిమా విడుదలై, లాభాలొస్తే చిత్రబృందం ఆ లాభాల్ని పంచుకోబోతోందన్నమాట. రోజువారీ ప్రొడక్షన్‌కి అయ్యే ఖర్చు నిర్మాతలు భరిస్తే సరిపోతుంది. ఈ తరహా ఆలోచనతో తెలుగులో ఓ సినిమా నిర్మించడం ఇదే తొలిసారి. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' విజయవంతమై లాభాలొస్తే మాత్రం భవిష్యత్తులో ఈ ఫార్ములా మీద మరిన్ని సినిమాలు రావడానికి ఆస్కారం ఉంది.