దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'పద్మావతి'. ఈ సినిమా స్టార్టింగ్ నుండీ సినిమా చుట్టూ చెప్పలేనన్ని వివాదాలే. ఎలాగోలా వివాదాలన్నీ నెట్టుకొని వచ్చి సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే విడుదలకు మళ్లీ కష్టాలే. మామూలు కష్టాలా అవి. సినిమాకే సినిమా కష్టాలు వచ్చి పడ్డాయంటే నమ్మి తీరాల్సిందే.
ఈ సినిమాను రాజ్‌పుత్ రాణి పద్మావతి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కించారు. దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కింది. సినిమాలో రాణీ పద్మావతికీ, అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రకీ మధ్య రొమాంటిక్ సన్నివేశాలున్నాయని భావించి, రాజ్‌పుల్ కర్ణి సేన ఆందోళనకు దిగింది. పవిత్రమైన రాణి పద్మావతిని ఆ రకంగా చూపిస్తారా? మా రాజ్‌పుత్ వంశాన్ని అవమానిస్తారా? అంటూ సినిమా నిర్మాణంపైనా, విడుదలపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు.
తాజాగా సినిమా విడుదలని అడ్డుకుంటామని కర్ణి సేన ఆందోళనలు ఉదృతం చేసింది. అయితే సినిమాలో రాజ్‌పుత్‌ల ప్రతిష్ఠని దెబ్బ తీసేలా, చరిత్రని వక్రీకరించే విధంగా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవనీ ఈ సినిమా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఓ వీడియో ద్వారా స్పందించారు. అయినా కానీ ఆందోళనలు ఆగడం లేదు. అయితే తాజాగా ఈ సినిమాని విడుదల చేయాలంటే రాజ్‌పుత్‌లు ముందుగా ఈ సినిమాని చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకపోతేనే సినిమా విడుదలకు ఒప్పుకుంటామనీ వారు అంటున్నారు. లేదంటే ఈ సినిమా విడుదలయ్యే ధియేటర్స్‌ని నాశనం చేసేస్తామనీ రాజ్‌పుత్ కర్ణి సేన అంటోంది.
అయితే ధియేటర్స్‌పై తమకు ఎలాంటి వైరం లేదనీ, కథ పైనే తమ అభ్యంతరం అనీ, కథపై తమ అభ్యంతరాలు దర్శక, నిర్మాతలకు చెప్పినా పట్టించుకోవడం లేదనీ అందుకే చివరికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనీ వారు తేల్చారు. మొత్తానికి ఇన్ని ఇబ్బందుల మధ్య ఈ సినిమా డిశంబర్ 1కి విడుదల అయ్యేనా? లేదా? ఏమో వేచి చూడాల్సిందే!