పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఇప్పటికే ఒప్పుకున్నారు. ఇదిలా ఉంటే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 'అయ్యప్పనుం కోషియుం' రీమేక్ లో నటించేందుకు కూడా సిద్ధమయ్యారని సమాచారం.
అయితే క్రిష్, హరీష్ శంకర్ సినిమాల తర్వాతే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని చాలామంది భావించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 'వకీల్ సాబ్' పూర్తయిన వెంటనే మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమా ఒక మల్టీ స్టారర్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో పాత్రకు తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ ను దర్శకుడు సాగర్ చంద్ర రెడీ చేశారని, పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని అంటున్నారు. అయితే ఇదొక ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా కావడంతో ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడి చేతిలో పెట్టాలని భావిస్తున్నారట.
అలాంటి దర్శకుడిని వెతికే బాధ్యతను ఇప్పటికే పవన్ తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్పగించారని అంటున్నారు. పవన్ ఈ సినిమాకు జస్ట్ రెండు నెలలు మాత్రమే కాల్షీట్స్ ఇస్తారని 'వకీల్ సాబ్' పూర్తయిన వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టి చకచకా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందట.