తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో 'అజ్ఞాతవాసి' సినిమా విడుదల. టిక్కెట్ ధరల్ని ఫ్లాట్ రేట్‌లో పెంచుకోవడానికి వీలు కలిగించిన తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు. అదనపు షోలకూ అనుమతి. విదేశాల్లోనూ బంపర్ రిలీజ్. ఇంత గ్రాండ్ లాంఛింగ్ లభించిందంటే వసూళ్ళు ఏ సినిమాకైనా రాకెట్ వేగంతో దూసుకుపోవాల్సిందే. అక్కడున్నది పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మరి.
కానీ అంచనాలు తల్లకిందులయ్యాయి. సినిమాకి తొలిరోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. 150 కోట్ల పైన వసూళ్ళు వస్తేనే సినిమా గట్టెక్కినట్లని ట్రేడ్ విశ్లేషకులు ముందుగా అంచనా వేస్తే, తొలి రోజు వచ్చిన డిజాస్టర్ టాక్‌తో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌తోపాటుగా నిర్మాత కూడా షాక్‌కి గురవ్వాల్సి వచ్చింది. పండగ సీజన్ కూడా 'అజ్ఞాతవాసి'ని కాపాడే ఛాన్స్ లేదని ముందే అంచనా వేసేశారంతా. అయితే అనూహ్యంగా 'అజ్ఞాతవాసి' సినిమా 70 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. నమ్మినా, నమ్మకున్నా ఇది నిజం.
12 కోట్ల రూపాయలకు పైగా అమెరికాలోనే వసూళ్ళు సాధించేసిందీ సినిమా. డిజాస్టర్ టాక్‌తోనూ పండగ సీజన్ కావడంతో కొంతమేర 'అజ్ఞాతవాసి' నష్టాల్ని తగ్గించుకోగలిగిందని చెప్పవచ్చేమో. 100 కోట్లు వచ్చినా సినిమాకి నష్టాలు తప్పవు. కానీ ఆ వంద కోట్లు సాధించడం కూడా చాలా చాలా కష్టం. వెంకటేష్ సీన్స్ అదనంగా యాడ్ చేశాక ఏమన్నా ఉపయోగం ఉంటుందేమోనని చిత్ర దర్శక నిర్మాతలు అనుకుని ఉండొచ్చు. కానీ అది కూడా అంతగా సినిమాకి ప్లస్ అవలేదని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
పండగ నేటితో దాదాపుగా ముగిసినట్లే. రేపటినుంచి 'అజ్ఞాతవాసి'కి మరింత గడ్డు కాలం ఎదురుకానుంది. ఏదేమైనా 70 కోట్ల క్లబ్‌లోకి చేరిన సినిమాగా మాత్రం 'అజ్ఞాతవాసి'కి ఓ రికార్డ్ దక్కింది.