పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? అనే ఆసక్తికరమైన అంశానికి తెర పడింది. ఆయన భీమవరం, గాజువాకల నుంచి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతున్నట్టు పార్టీ ప్రకటించింది. అనంతపురం, తిరుపతి, పిఠాపురం, పెందుర్తి... ఇలా చాలా పేర్లు పరిశీలించిన పిదప.. ఈ రెండు స్థానాల్ని ఖరారు చేశారు. గతంలో చిరంజీవి కూడా ప్రజారాజ్యం తరపున రెండు స్థానాలలో (తిరుపతి, పాలకొల్లు) పోటీకి దిగారు. తిరుపతిలో గెలిచి, పాలకొల్లులో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
అయితే... ఈసారి పవన్ కళ్యాణ్ నిలబడే స్థానాల ఎంపిక వ్యూహాత్మకంగానే సాగినట్టు అనిపిస్తోంది. పవన్ తప్పకుండా గెలిచే స్థానాలనే ఎంచుకున్నట్టు స్పష్టం అవుతోంది. భీమవరంలో కాపు సామాజిక వర్గం హవా ఎక్కవ. అక్కడ పవన్ ఫ్యాన్స్ జోరుగా ఉన్నారు. గతంలో పిఆర్పీ అతి స్వల్పమైన తేడాతో ఇక్కడ ఓడిపోయింది. అయితే.. పవన్ నిలబడితే ఆ క్రేజే వేరు. అభిమానులే పవన్‌ని గెలిపించుకుంటారు.
ఇక గాజువాకలో జనసేనకు తిరుగుండకపోవచ్చన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఎందుకంటే.. గాజువాకలోనూ పవన్ సామాజిక వర్గానికి బలమైన ఆధిక్యత. గతంలో ఇక్కడ టీఆర్పీ ఘన విజయం సాధించింది. పవన్ ప్రచారం చేయకపోయినా గెలిచి తీరే స్థానాలు ఇవి రెండు. కాబట్టి పవన్ గెలుపు లాంఛనమే అనుకోవాలిక.