పదేళ్ల క్రితం... అచ్చం ఎన్టీఆర్‌లా ఖాకీ దుస్తులు ధరించి - టీడీపీ పార్టీ జెండా పట్టుకుని- విస్కృతమైన ప్రచారం చేశాడు జూ.ఎన్టీఆర్. ప్రమాదం జరిగి, ఆసుపత్రి మంచం మీద ఉన్నా సరే- పార్టీకి సేవ చేయడం మానలేదు. పడక మీదే... తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అంటూ.. అభిమానులకు సందేశం పంపాడు. అయితే ఆ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. 2014 ఎన్నికలలో ఎన్టీఆర్ జాడే లేకుండా పోయింది. ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. ఎన్టీఆర్‌కీ - బాలయ్యకు మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే టీడీపీకి ఎన్టీఆర్ దూరం అయ్యాడని చెప్పుకున్నారు.
కనీసం ఈసారైనా ఎన్టీఆర్ ప్రచారం కోసం నడుం బిగిస్తాడనుకున్నారంతా. ఎందుకంటే ఈమధ్య బాలయ్యకూ, బుడ్డోడికీ మధ్య రాపో బాగానే ఉంది. ఒకరి ఫంక్షన్లకు మరొకరు వెళ్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో టీడీపీ తరపున ఈసారి జూ.ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడేమో అని నందమూరి అభిమానులు ఆశ పడుతున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం మౌనంగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ దీ అదే పరిస్థితి. గతంలో కూకట్ పల్లి నియోజక వర్గంలోంచి నందమూరి సుహాసిని పోటీకి దిగినప్పుడు కూడా వీరిద్దరూ ప్రచారం కోసం రాలేదు. ఇప్పుడూ అంతేనా? ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ వీళ్లకు ఇప్పుడు అవసరం లేదా?
ప్రచారానికి రావాల్సిన అవసరం కూడా లేదు. 'నేను టీడీపీ పార్టీ మనిషినే.. నా అభిమానులూ.. ఈ పార్టీకే ఓటేయండి' అంటూ ఓ వీడియో విడుదల చేసినా చాలు. కానీ.. అటు ఎన్టీఆర్, ఇటు కల్యాణ్ రామ్ ఇద్దరూ తటస్థంగానే కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గానీ, నందమూరి బాలకృష్ణగానీ తమని పిలిస్తే.. అప్పుడు ప్రచారంలోకి దిగుదామని నందమూరి బ్రదర్స్ ఆలోచిస్తున్నారేమో. మరోవైపు పార్టీ కార్యకర్తల మాట మరోలా ఉంది. 'తాతయ్య పార్టీని గెలిపించమని ఎవరైనా బొట్టు పెట్టి పిలవాలా..?' అని వాళ్లు అంటున్నారు. ఈ లెక్క ఇప్పట్లో తేలేది కాదు. ఈలోగా ఈ ఎన్నికలు వస్తాయి, వెళ్లిపోతాయి కూడా.