పవన్ కళ్యాణ్‌కీ, అలీకి మధ్య ఉన్న స్నేహ బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలీ లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా లేదు. అలీ తన గుండెకాయ అని చాలాసార్లు పవన్ బహిరంగంగానే చెప్పారు కూడా. అలాంటిది రాజకీయాల్లోకి వచ్చాక అలీ చాలా మారిపోయాడు. తనని అంతగా నమ్మిన స్నేహితునికి వెన్నుపోటు పొడిచి, వైకాపాలో చేరారు. ఆ విషయమై తాజాగా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వెలువరించిన విధానం సంచలనమైంది. 'అందరి కంటే ఎక్కువగా అలీని నమ్మాను. అలీ చేసిన పనికి మనుషులంటే నమ్మకం పోయింది.
రాజకీయాల్లోకి రావడానికి ముందు అలీ మొదట నన్నే కలిశారు. తాను సూచించిన వారికి సీట్లు ఇమ్మని అడిగాడు. కలిసి పని చేద్దామని నమ్మ పలికాడు. మెల్లగా వెళ్లి వైకాపాలో చేరాడు. జగన్ ఎంపీ సీటిస్తానని ఆశ చూపడంతో ఆలీ అటువైపు మొగ్గు చూపాడు. అయినా అలీ లేనంత మాత్రాన నాకు జరిగే నష్టమేంటీ.? జగన్‌ని శక్తివంతమైన నాయకుడిగా అలీ భావించి ఉండొచ్చు.. అందుకే వైకాపాలో చేరాడు. ఏ పార్టీలో చేరాలన్నది ఎవరికి వారికే వారి వ్యక్తిగతం..' అని రాజమండ్రి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఆలీనుద్దేశించి వ్యాఖ్యానించారు.