తెలుగు సినీ పరిశ్రమ నుంచి విరాళాలు పోటెత్తుతున్నాయి.. తెలుగు రాష్ట్రాలకీ, కేంద్ర ప్రభుత్వానికీ, తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులకీ. ఎవరికి తోచిన రీతిలో వారు విరాళాలు ప్రకటిస్తున్నారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం విదితమే. సినీ నటుడిగానే కాదు, ఓ రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్ని పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఇప్పటికే ప్రకటించారాయన. మరోపక్క, ప్రభుత్వ రంగ సంస్థలు, బహుళ జాతి సంస్థలకీ, ఇతర సంస్థలకీ పవన్ కళ్యాణ్ ఓ విజ్ఞప్తి చేశారు.
ఇదిప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. ‘కోవిడ్ 19 అరుదైన మహమ్మారి. ప్రభుత్వాలు మాత్రమే రాష్ట్రాలు / దేశాన్ని లేదా ప్రపంచాన్ని రక్షించలేవు. ఒక మార్గం వుంది.. మీరు ఒక వ్యక్తి కావొచ్చు.. చిన్న మధ్య తరహా పరిశ్రమ కలిగినవారో, ప్రభుత్వ రంగ సంస్థ వారో, బహుళ జాతి సంస్థకు చెందినవారో అయితే దయచేసి మీ ఉద్యోగులని మూడు నెలలపాటు జాగ్రత్తగా చూసుకోండి.. ఆ ఉద్యోగుల కుటుంబాలు ఆకలితో బాధపడకుండా చూడండి’ అన్నది జనసేన అధినేత సూచన.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ సూచన / విజ్ఞప్తి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరోపక్క, తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, సినీ కార్మికుల కోసం కోటి విరాళం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పవన్, తెలుగు సినీ పరిశ్రమ తరఫున విరాళాలు ప్రకటించిన ప్రభాస్, రామ్ చరణ్, మహేష్, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇలా అందరినీ పేరు పేరునా ట్విట్టర్ ద్వారా అభినందించారు.