ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడడం అందరినీ షాక్‌లో ముంచెత్తింది. ఇప్పుడు రాధే శ్యామ్ కూడా అదే బాటలో నడుస్తోంది. చిన్నా చితకా సినిమాలు తప్ప, ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల హడావుడి లేకపోవడం నిరుత్సాహ పరిచే విషయం. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేకపోయినా... పవన్ ఫ్యాన్స్ మాత్రం దిల్ రాజుపై గుర్రుగా ఉన్నారు. ఈనెల 12న భీమ్లా నాయక్ సినిమా విడుదల కాకుండా అడ్డుకున్నది ఆయనే అన్నది పవన్ ఫ్యాన్స్ అభియోగం. దిల్ రాజు గనుక రంగంలోకి దిగి, భీమ్లా నాయక్ ని వెనక్కి లాగకపోతే... నిక్షేపంగా ఈనెల 12న వచ్చేసేది. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్‌లకు దారి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో భీమ్లా నాయక్ ని వాయిదా వేయించాడు దిల్ రాజు. ఆయన కూడా ఇప్పటి పరిస్థితుల్ని ఊహించి ఉండడు.
కాకపోతే.... ఆర్.ఆర్.ఆర్ కి వాయిదాల పర్వం అలవాటే. ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. అలాంటి సినిమాని దారి ఇవ్వడానికి, భీమ్లా నాయక్ ని ఆపాల్సివచ్చింది. ఆప్పుడు ఆర్.ఆర్.ఆర్ రావడం లేదు. భీమ్లా కీ స్కోప్ లేదు. భీమ్లా సంక్రాంతికి రాకపోవడం వల్ల కనిపించని నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి వచ్చింది. సంక్రాంతి చాలా పెద్ద సీజన్. దాన్ని మిస్ చేసుకోవడమే కాకుండా... బ్యాడ్ సీజన్ గా పేరొందని ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేస్తున్నారు. అదీ ఓ రకంగా రిస్కే.