పవన్ కల్యాణ్‌కీ ఏపీ ప్రభుత్వానికీ మధ్య వివాదం ముదురుతోంది. పవన్ కల్యాణ్ ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఓ జీవోని తెచ్చి, టికెట్ రేట్లని హడావుడిగా తగ్గించేసిందన్నది పవన్ అభిమానుల వాద. మొన్న రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలోనూ పవన్ కల్యాణ్ ఇదే చెప్పాడు. `కావాలంటే నన్ను బ్యాన్ చేయండి, టాలీవుడ్ ని వదిలేయండి` అని జగన్ ప్రభుత్వానికి సూచించాడు. ఇక మీదట కూడా పవన్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం అడ్డు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది పవన్ ని నమ్ముకున్న నిర్మాతలకు మంచిది కాదు. థియేటరికల్ రిలీజ్ ని అడ్డుకుని, కొత్త గొడవలు సృష్టిస్తే - పవన్ తో సినిమా తీసిన నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే పవన్ ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
థియేటరికల్ రిలీజ్ విషయంలో ప్రభుత్వం పవన్ ని ఆటక పరిచే అవకాశాలున్నాయి. ఓటీటీలో విడుదల చేస్తే ఆ గొడవ ఉండదు కదా? అందుకే పవన్ సైతం తన నిర్మాతల్ని పిలిచి `నా సినిమాల్ని ఓటీటీకి ఇచ్చుకున్నా నాకు అభ్యంతరం లేదు` అని చెప్పినట్టు సమాచారం. ఓటీటీకి ఎక్స్ క్లూజీవ్ గా సినిమా అమ్మితే... భారీ రేటే వస్తుంది. ఉదాహరణకు భీమ్లా నాయక్ సినిమా దాదాపు 100 కోట్లకు అమ్ముడైపోతుంది. డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ ఉండనే ఉంటాయి. ఆ రూపంలో మరో 50 కోట్లయినా వస్తాయి. అంటే థియేటర్లో రిలీజ్ అవ్వకుండానే 150 కోట్లు వస్తాయన్నమాట. సినిమాకి మహా అయితే 100 కోట్లు ఖర్చు అయ్యిందనుకుంటే, 50 కోట్లు లాభమే. ఈ లెక్కన ఓటీటీలో విడుదల చేయడం శ్రేయస్కరం. మరి పవన్ సూచనని నిర్మాతలు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి.