రవితేజ తాజా చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ' రిలీజ్‌కి సిద్ధమైంది. నవంబర్ 16న ఈ 'ట్రిపుల్ అ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మాస్ రాజా రవితేజ ఇంకో కొత్త చిత్రానికీ కొబ్బరి కాయ కొట్టేసిన సంగతి తెలిసిందే. అదే విలక్షణ చిత్రాల దర్శకుడు వి.ఐ.ఆనంద్.
ఈ సినిమా డిశంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇదో ప్రయోగాత్మక చిత్రమనీ తెలుస్తోంది. వి.ఐ.ఆనంద్ సినిమా అంటేనే రెగ్యులర్ కమర్షియల్ స్టోరీలకు భిన్నంగా ఉంటుంది. రీ ఎంట్రీలో రవితేజ కూడా రొటీన్‌కి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఎంట్రీ మూవీతోనే అంధుడిగా సరికొత్త ప్రయోగం చేసేశాడు. త్వరలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' అంటూ ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నాడు. ఇక రాబోయే చిత్రంలోనూ రవితేజ డబుల్ ధమాకా అనీ తెలుస్తోంది. తండ్రీ కొడుకులుగా రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడనీ తెలుస్తోంది.
ఆల్రెడీ రవితేజ 'దరువు' సినిమాలో డ్యూయల్ రోల్ పోషించేశాడు. అయితే తండ్రీ కొడుకుల పాత్ర అంటే కాస్త కొత్తగానే ఉంటుందని భావించాలి. ఇకపోతే ఈ సినిమా హీరోయిన్స్ విషయానికి వస్తే, ముగ్గురు ముద్దుగుమ్మలతో రవితేజ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయనున్నాడట. వారిలో 'నన్ను దోచుకుందువటే' ఫేం నభా నటేష్ ఓ హీరోయిన్ కాగా, మరో ముద్దుగుమ్మను లేటెస్టుగా ఎంపిక చేశారట.
ఆమె మరెవరో కాదు, 'ఆర్ఎక్స్ 100' బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాకే అందాల విందుతో పాటు, పర్ఫామెన్స్తోనూ ఉర్రూతలూగించేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాస్ రాజా పక్కన మసాలాకి రెడీ అయిపోతోందన్నమాట. 'డిస్కో రాజా' అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ సినిమాకు రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.