కొంత మంది టెక్నిషియన్లు ఒక ప్రాజెక్ట్ ఓకే చేస్తే చాలు. ఆటోమేటిక్ గా ఈ సినిమాకి ఒక హైప్ వచ్చేస్తుంది. టైటిల్ కార్డ్ పై కొన్ని పేర్లు కనిపిస్తే చాలు. వారిని అభిమానించే అభిమానులు మరో ఆలోచన లేకుండా టికెట్టు తెంచేస్తారు. అలాంటి స్టార్ క్రేజ్ వున్న టెక్నిషియన్స్ లో టాప్ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరాం ఒకరు. స్టార్ హీరోల డేట్లు దొరుకుతాఏమో కానీ ఆయన డేట్లు పట్టడం కష్టం అని చెబుతుంటారు. ఆయన కోసమే దాదాపు ఏళ్ల పాటు ఎదురుచూసే దర్శకులు వున్నారు. ఇప్పుడాయన ఓ తెలుగు సినిమా అంగీకరించారు. హీరో ఎవరో తెలుసా ? నందమూరి కళ్యాణ్ రామ్.
ఇజం తర్వాత కొత్త సినిమా ప్రకటన చేయలేదు కళ్యాణ్. అయితే ఎట్టకేలకు ఆయన నుండి కొత్త సినిమా ప్రకటన వచ్చింది. జయంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు కళ్యాణ్. ఈ చిత్రానికి పీసీ శ్రీరాం ఛాయాగ్రహణం. ఈ విషయాన్ని తెలియజేస్తూ పీసీ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా వుండబోతుందట. దర్శకుడు జయేంద్రతో వున్న సాన్నిహిత్యం ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేశారట పీసీ. ఇష్క్ తర్వాత పీసీ శ్రీరాం నేరుగా తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. ఇంతకీ ఈ జయేంద్ర ఎవరో తెలుసా? సిద్దార్ద్ హీరోగా 180అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకి ఈయనే దర్శకుడు. సినిమా ఆడలేదు కానీ వైవిధ్యమైన సినిమాగా పేరు తెచ్చుకుంది. మరి, కళ్యాణ్ రామ్ ను ఆయన ఎలా చూపించబోతున్నాడో చూడాలి.