ఈమధ్య ట్రేడ్ పండితులు విస్మయపరిచే రిజల్ట్.. `పెళ్లి సందడి` నుంచి వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన సినిమా ఇది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. దసరా సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. అయితే విడుదల రోజున పెద్దగా అంచనాలు లేవు. రివ్యూలు కూడా చాలా తేడాగా వచ్చాయి. పైగా మహా సముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి క్రేజీ సినిమాలతో పోటీ. దాంతో... పెళ్లి సందడి పని అయిపోయిందనుకున్నారంతా.
అయితే అనూహ్యంగా.. పెళ్లి సందడి మంచి కలక్షన్లు రాబట్టింది. యువతరం ప్రేక్షకుల అండతో.. బాక్సాఫీసు దగ్గర నిలబడగలిగింది. తొలి వారం ఈసినిమా దాదాపుగా 5.5 కోట్లు రాబట్టింది. నైజాంలో 1.65 కోట్లు తెచ్చుకుంటే, సీడెడ్ లో 1.19 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో మాత్రం పెళ్లి సందడి జోరు ఏమాత్రం కనిపించలేదు. అక్కడ ఈ సినిమా డిజాస్టర్ కిందే లెక్క. ఏపీ, తెలంగాణలో మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓటీటీ, శాటిలైట్ హక్కులు కలుపుకుంటే, నిర్మాతలకు మంచి లాభాల్ని అందించినట్టే అవుతుంది. ఈమధ్య కాలంలో డిజాస్టర్ టాక్ వచ్చి కూడా, ఈస్థాయి వసూళ్లు తెచ్చుకున్న సినిమా ఇదే కావొచ్చు.