సినీ క్రిటిక్ గా ప్రాచుర్యంలోకి వచ్చి గత కొంతకాలంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచినా మహేష్ కత్తి పైన బీజీపీ ఎమ్యెల్యే హైదరాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే, మహేష్ కత్తి నిన్న ట్విట్టర్ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించే క్రమంలో ఆయన ప్రధానమంత్రి మోడికి ఎన్నికల సమయంలో సహాయం చేయడం పట్ల తన వ్యతిరేకతని ట్వీట్ రూపంలో చెప్పాడు. ఆ సందర్భంలో సదరు ట్వీట్ లో ప్రధానమంత్రి మోడీని ఒక నరహంతకుడిగా పేర్కొనడం పట్ల బీజీపీ ఎమ్యెల్యే రాజా సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
వెంటనే అదే ట్వీట్ ని హైదరాబాద్ పోలిసుల ట్విట్టర్ ఖాతాకి పంపి అతని పై చర్యలు తీసుకోవలసిందిగా కోరాడు. పోలీసులు కూడా వెంటనే తాము సంబందిత అధికారులకి సమాచారమిచ్చి ఈ విషయం పైన తగు చర్యలుతీసుకుంటాము అని జవాబు ఇచ్చారు.
దీనితో ఆయన పైన ఏ క్షణములో అయినా పోలీసులు కేసు నమోదు చేస్తారు అన్న వార్తల వెలువడుతున్నాయి. మొత్తం ఈ ఎపిసోడ్ లో కొసమెరపు ఏంటంటే- ఇలా ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తే అది చెల్లదు అని, సదరు ఎమ్యెల్యే కన్నా తనకే చట్టం గురించిన అవగాహన ఉంది అంటూ మహేష్ కత్తి ట్వీట్ చేశాడు.