'ఆకు చాటు పిందె తడితే..' అంటూ శ్రీదేవి పాత్రలో నటించి రకుల్ ప్రీత్‌సింగ్ ఆకట్టుకుంది 'ఎన్టీఆర్ - కథానాయకుడు'లో. ఇప్పుడు శ్రీదేవి పాటకు ఇంకో ముద్దుగుమ్మ స్టెప్పులేయనుంది. ఆమె ఎవరో కాదు, జిగేల్ రాణి పూజాహెగ్దే. ప్రస్తుతం పూజా హెగ్దే 'వాల్మీకి' సినిమాలో వరుణ్ తేజ్‌కి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలనాటి బ్లాక్ బస్టర్ మూవీ 'దేవత' సినిమా నుండి సూపర్ హిట్ సాంగ్ 'వెల్లువెత్తి గోదారమ్మ వెల్లకిల్లా పడ్డాదమ్మా..' అనే సాంగ్‌ని రీమిక్స్ చేస్తున్నారని సమాచారం.
ఆ పాటకు ఎవర్ గ్రీన్ అందగాడు శోభన్‌బాబు, అతిలోక సుందరి శ్రీదేవి అదిరిపోయే స్టెప్పులేశారు అప్పట్లో. గోదారి ఒడ్డున బిందెల సెట్టింగ్‌తో ఆ పాట వినసొంపుగానే కాదు, చూసేందుకూ చూడ చక్కగా ఉంటుంది. శ్రీదేవి, శోభన్ బాబు జంట ఆకట్టుకుంటుంది. ఇప్పుడీ పాటను కథానుగుణంగా హరీష్ శంకర్ తన సినిమాలో రీమిక్స్ చేయబోతున్నాడట. వరుణ్ తేజ్, పూజా హెగ్దే ఈ పాటకు చిందేయనున్నారట.
అదే గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారనీ తెలుస్తోంది. గోదారమ్మ ఒడిలో కలర్ ఫుల్ సెట్‌ని ఈ పాట కోసం సిద్ధం చేస్తున్నారట. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెట్టనున్నారనీ తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపస్తున్న సంగతి తెలిసిందే. అధర్వ మురళి, మృణాలిని మరో జంటగా కనిపించనున్నారు. సెప్టెంబర్ 20న 'వాల్మీకి' ప్రేక్షకుల ముందుకు రానుంది.