'ఆదిపురుష్...' ప్రభాస్ ఓకే చేసిన మరో పాన్ ఇండియా సినిమా. రామాయణ గాథని మరో కోణంలో చూపించబోతున్నాడు ఓం రౌత్. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్.. ఇలా ఈ సినిమాలో పెద్ద కాస్టింగే ఉంది. త్రీడీ సినిమా. పౌరాణికం. కాబట్టి.. తప్పకుండా ఏళ్లకు ఏళ్లు తినేస్తుంది. కాకపోతే... ఈ సినిమా షూటింగ్ పార్ట్ ని కేవలం 70 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నాడట దర్శకుడు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పక్కాగా జరగబోతున్నాయి.
సాధారణంగా సెట్స్ రూపకల్పనకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈ సినిమా కోసం చాలా తక్కువ సెట్స్ వాడతార్ట. షూటింగ్ అంతా గ్రీన్ మ్యాట్ లోనే. పైగా సింగిల్ షెడ్యూల్ లోనే కంప్లీట్ చేస్తార్ట. అయితే.. పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ సమయం తీసుకుంటారు. 2021 ఏప్రిల్ నుంచి.. `ఆదిపురుష్` పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే ఈలోగా.. నాగ అశ్విన్ సినిమాని కూడా మొదలెట్టి, 20 రోజుల పాటు ఓ చిన్న షెడ్యూల్‌ని పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
నాగ అశ్విన్ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 2021 మే - జూన్‌లలో దీపిక కాల్షీట్లు ఇచ్చిందని సమాచారం. అంటే.. నాగ అశ్విన్ సినిమా రెండో షెడ్యూల్ అప్పుడు మొదలవుతుందన్నమాట. రెండు సినిమాలూ సమాంతరంగా సాగినా.. తొలుత విడుదలయ్యేది ఆదిపురుష్‌నే. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకీ ఓకే చెప్పాడు ప్రభాస్. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.