బాహుబలి తరవాత ప్రభాస్ రేంజు అమాంతంగా పెరిగిపోయింది. ఆ సినిమాతో తను ఇంటర్నేషన్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి ప్రభాస్ తో సినిమా అంటే... అదే స్థాయిలో ఉంటోంది. ప్రభాస్ పారితోషికం కూడా చుక్కల్ని అందుకుంటోంది. బాహుబలికి ప్రభాస్ ఎంత తీసుకున్నాడో ఇప్పటి వరకూ ఎవరికీ తెలీదు. ఏళ్లకు తరబడి సెట్లో ఉండిపోయిన సినిమా అది. రెండు భాగాల కోసం ప్రభాస్ అహర్నిశలూ కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ప్రభాస్‌కి ఎంతిచ్చినా తక్కువే. ఆ తరవాత సాహో చేశాడు. యూవీ క్రియేషన్స్ సంస్థపై చేసిన సినిమా ఇది. దాంతో ఆ సినిమా ప్రభాస్ పారితోషికం కూడా లెక్కల్లోకి రాదు.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం.. గోపీకృష్ణ బ్యానర్‌లో వస్తోంది. ప్రభాస్ సొంత బ్యానర్ అది. కాబట్టి... ఈ సినిమా పారితోషికం కూడా తెలీదు. ఇప్పుడు ప్రభాస్ పారితోషికానికి సంబంధించిన అధికారిక లెక్కలు కాస్త అనధికారంగా బయటకు వచ్చాయి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు వైజయంతీ మూవీస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఈ సినిమా కోసం ప్రభాస్‌కు 70 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందించే చిత్రమిది. కాబట్టి... ఆ మేరకు పారితోషికం ఇవ్వడంలో తప్పులేదు. ఈ లెక్కన ప్రభాస్.. మహేష్‌ని దాటేసినట్టే.
సరిలేరు నీకెవ్వరు సినిమాకి మహేష్ 53 కోట్ల పారితోషికం అందుకున్నాడని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటివరకూ టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరో మహేష్ నే. ఇప్పుడు ఆ రికార్డు ప్రభాస్ ఈజీగా దాటేశాడన్నమాట.