ప్రభాస్ తొట్టతొలి హిందీ సినిమా `ఆది పురుష్`కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రభాస్ రాముడిగా నటిస్తాడన్న హింట్ దొరికేసింది. ఈసినిమాలో ప్రభాస్ పాత్రలో చాలా రకాల పార్శ్వాలుంటాయని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఒప్పుకున్నంత తేలిక కాదు.. రాముడి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం. ఈ సినిమా కోసం ప్రభాస్ చేయాల్సింది చాలా వుంది. అందుకు సంబంధించిన కసరత్తులు కూడా మెల్లమెల్లగా మొదలెడతాడట.
ప్రస్తుతం `రాధే శ్యామ్`తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. బాహుబలి కోసం బాగా బరువు పెరిగిన ప్రభాస్... సాహోలోనూ ఇంచుమించు అలానే కనిపించాడు. రాధే శ్యామ్ లో మాత్రం బాగా స్లిమ్ అయ్యాడు. కానీ.. `ఆదిపురుష్` కోసం మళ్లీ బరువు పెరగాల్సివుందట. అంతేకాదు... ఈ సినిమా కోసం విలువిద్యలో శిక్షణ తీసుకోబోతున్నాడట. జులపాలు కూడా బాగా పెంచాలని, మైథాలజీ సినిమాలకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్ అలవాటు చేసుకోవాలని భావిస్తున్నాడట. `రాధే శ్యామ్` అయ్యాకే... `ఆది పురుష్`కి సంబంధించిన కసరత్తులు మొదలెడతారని టాక్. మధ్యలో నాగ అశ్విన్ సినిమా కూడా ఉంది. మరి ముందు ఆది పురుష్ మొదలవుతుందా? లేదంటే... నాగ అశ్విన్ సినిమా అయ్యకే, ఆది పురుష్ ని పట్టాలెక్కిస్తారా? అన్నది తేలాలి.