డాన్స్ అన్న ప్రస్థావన ఎవరైనా తీసుకురావాలంటే ముందుగా ప్రభుదేవా పేరు జపించాల్సిందే. ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా ప్రభుదేవాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏదో అలవోకగా వచ్చేసిన డాన్స్ కాదది. సుదీర్ఘ శ్రమ.. నిత్యాభ్యాసం.. ఇవన్నీ ప్రభుదేవాని ఇప్పుడీ స్థాయిలో నిలబెట్టాయి. ఓ పాటను చూస్తే ఇది ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన పాట అని చెప్పేయగలం. అదీ అతని ప్రత్యేకత. ఎందరో కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవాని అనుకరించారు.
కానీ ఇంతవరకూ ప్రభుదేవాని మ్యాచ్ చేసిన కొరియోగ్రాఫర్ లేడంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా ఏ భాషలో తీసుకున్నా సరే కొరియోగ్రాఫర్‌గా ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ ప్రభుదేవా పేరు మీదే ఉంటుంది. ప్రభుదేవా శరీరంలో అసలు ఎముకలున్నాయా.? లేదా.? ఆ ఎముకల స్థానంలో స్ప్రింగులున్నాయా.? అనే డౌట్ చాలా మందికి వస్తుంది. వెస్ట్రన్ డాన్స్ కావచ్చు ట్రెడిషనల్ డాన్స్ కావచ్చు దేనిలోనైనా ప్రభుదేవాకున్న ప్రావీణ్యం అద్భుతం.
సినీ డాన్సులకు ప్రభుదేవా చేసిన సేవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నటుడిగా దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్నా, ప్రభుదేవాలోని కొరియోగ్రాఫర్‌ని ఎప్పటికీ మర్చిపోలేం. 25 ఏళ్ల క్రితం ప్రభుదేవా కొరియోగ్రఫీ, ఇప్పుడు ప్రభుదేవా కొరియోగ్రఫీ బేరీజు వేస్తే ఒక స్పార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈ డాన్సింగ్ సెన్సేషన్‌కి దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన 'పద్మశ్రీ' దక్కింది. డాన్స్‌కి ప్రభువు, దేవుడు ఈ ప్రభుదేవా.!