తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుపరిచితుడు ప్రకాష్‌రాజ్. ఆయన ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి రెడీగా ఉన్నారంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అంటే ఆయన రాజకీయాల్లో బిజీ కానున్నారని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రకాష్‌రాజ్ ఎక్కువగా కనిపిస్తున్నారు. లేటెస్టుగా కేసీఆర్ కర్ణాటక వెళ్లారు. కేసీఆర్ వెంట ప్రకాష్‌రాజ్ కూడా ఉన్నాడు. మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ భేటీ అయితే, ఆయన వెంట ప్రకాష్‌రాజ్ కనిపించి అందరికీ షాకిచ్చారు.
ప్రకాష్‌రాజ్ మంచి నటుడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా చాలా మంచి పేరుంది ప్రకాష్‌రాజ్‌కి. అలాగే ఆయనకు సామాజిక అంశాలపై కూడా స్పష్టమైన అవగాహన ఉంది. రాజకీయాల పరంగా కూడా పలు అంశాలపై స్పందించి ఈ మధ్య ఆయన కొన్ని వివాదాలతో వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా కేసీఆర్ వెంట ప్రకాష్ రాజ్ కనిపించడంపై పలు అనుమానాలు వస్తున్నాయి.
టీఆర్‌ఎస్ పార్టీ తరపున ప్రకాష్‌రాజ్ రాజకీయంగా పావులు కదిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 2019 ఎలక్షన్స్‌లో టీఆర్‌ఎస్ తరపున ప్రకాష్‌రాజ్ విసృత ప్రచారానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెరపై తండ్రిగా, తాతగా, విలన్‌గా, పలు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి, తనదైన శైలిలో సత్తా చాటిన ప్రకాష్ రాజ్ ఇకపై రాజకీయాల్లో కూడా సత్తా చాటుతారా అనేది చూడాలి.