వెండితెరపై క్రూరమైన విలన్ పాత్రలకు ప్రసిద్ధి... ప్రకాష్ రాజ్. కానీ ఇప్పుడు ధాతృత్వంలో తన హీరోయిజం చూపిస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల ప్రజా జీవితం స్థంభించిపోయింది. చాలామందికి ఉద్యోగాలు పోయాయి. కొన్ని కంపెనీలు జీతాలు ఎగ్గొట్టాయి. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం తన సిబ్బందికి ముందుగానే రెండు నెలల జీతాలు ఇచ్చి ఆదుకున్నాడు. ఈ విషయంలో తొలిగా స్పందించిన సినీ సెలబ్రెటీ.. ప్రకాష్‌రాజే. లాక్ డౌన్ వల్ల తన సినిమా షూటింగులు ఆగిపోయాయని, నగదు నిల్వలు కూడా హరించుకుపోయాయని, అయినా సరే, అప్పు చేసైనా సరే, తన సిబ్బందికి జీతాలు ఇస్తానని ఇది వరకు ప్రకటించాడు.
ఇప్పుడు వలస కూలీలకు తన వంతు సహాయం చేస్తున్నాడు. హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్ హోస్ లో వందల మంది వలసకూలీలకు భోజన ఏర్పాట్లు చేస్తున్నాడు. వాళ్లని తమ సొంత గ్రామాలకు తరలించడంలో తన వంతు సహాయం చేస్తున్నాడు. అందుకోసం భారీగా ఖర్చవుతోంది. తన దగ్గర డబ్బులు అయిపోతున్నాయని, అయితే.. అప్పు చేసైనా వలస కూలీలకు అండగా ఉంటానని, అవసరమైతే భిక్షాటన చేస్తానని ప్రకటించాడు ప్రకాష్‌రాజ్. వలస కూలీలు తనకు ఏమీ తిరిగి ఇవ్వరని తనకు తెలుసని, కానీ వాళ్లు స్వగ్రామాలకు క్షేమంగా తరలివెళ్లడంలో తన వంతు పాత్ర తాను పోషించానన్న సంతృప్తి చాలని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ విషయంలో ప్రకాష్‌రాజ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరో విలన్ సోనూసూద్ కూడా వలస కార్మికుల్ని వాళ్ల ఇంటికి పంపడంలో తన వంతు సహాయం చేస్తున్నాడు. ఆఖరి వలస కూలీ ఇంటికి వెళ్లేంత వరకూ... తన సేవ కొనసాగుతుందని హామీ ఇచ్చాడు. మొత్తానికి ఈ వెండి తెర విలన్లు.. కరోనా టైమ్ లో హీరోలుగా మారిపోయారు.