మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. శరవేగంగా సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈలోగా సినిమా నుండి ఓ ప్రీ లుక్ వదిలారు. రేపు రాత్రి 8 గంటలకు ఫస్ట్‌లుక్ వదలనున్నారు. ప్రీ లుక్‌లో రెండు చేతులు ఒకరిని ఒకరు ఒడిసిపట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఓ పెద్ద వయసు వ్యక్తి చేతుల్ని, తేజు ఆప్యాయంగా బలంగా పట్టుకుని ఆపన్న హస్తం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఆ పెద్ద వ్యక్తి సత్యరాజ్ అనుకోవాలి. ఆయన ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పోస్టర్‌పై 'వేలు విడవని బంధం' అనే క్యాప్షన్ ఆసక్తి రేపుతోంది. బ్యాక్ గ్రౌండ్‌లో పల్లెటూరి వాతావరణం సుస్పష్టంగా కనిపిస్తోంది. జి.ఎ.పిక్చర్స్, యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాశీఖన్నీ, సాయి ధరమ్‌తేజ్‌తో జోడీ కడుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సుప్రీమ్' తేజు కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది.
అదే సెంటిమెంట్ వర్కవుట్ అయితే, ఈ సినిమా కూడా మంచి హిట్ కొట్టాలి. ఇటీవలే 'చిత్రలహరి'తో లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ కొట్టాడు తేజు. ఈ సినిమాతో ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలిక. డిశంబర్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.