సుధీర్‌బాబు హీరోగా కొన్నాళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ప్రేమకథా చిత్రమ్' అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుంది. భయపెడుతూ, నవ్వించడం, నవ్విస్తూ, భయపెట్టడం ఆ సినిమాకి బాగా వర్కవుట్ అయ్యింది. ఆ తర్వాత ఆ తరహాలో చాలా సినిమాలొచ్చాయి. కొన్ని విజయవంతమయ్యాయి కూడా. ఆ 'ప్రేమకథా చిత్రమ్'కి సీక్వెల్ వస్తోందిప్పుడు.
సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లున్నారు. ఒకరు 'జంబలకిడిపంబ' ఫేం సిద్దీ ఇద్నానీ కాగా, ఇంకొకరు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేం నందితా శ్వేతా. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజయ్యింది. సిద్దీ ఇద్నానీ పాత్ర హత్యకు గురవడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆమెని చంపింది హీరోయేనని అనుమానం రేకెత్తించేలా కట్ చేశారు టీజర్‌ని.
నందితా శ్వేతాని దెయ్యం పాత్రలో చూపించారు. ఆల్రెడీ నందితా శ్వేతా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'లో దెయ్యం పాత్రలో నటించి మెప్పించడంతో ఈ సినిమాలో దెయ్యం పాత్ర కొట్టినపిండిలానే అనిపిస్తోందామెకి. సుమంత్ అశ్విన్ మంచి నటుడు. ఇద్దరు హీరోయిన్లు గ్లామర్‌తో ఆకట్టుకోగలరు. సినిమా నిండా కావల్సినన్ని నవ్వులూ ఉన్నాయి. భయపెట్టే సన్నివేశాలు సరేసరి. 'ప్రేమకథా చిత్రమ్'లా ఈ ప్రేమకథాచిత్రమ్ 2' కూడా సంచలన విజయాన్ని అందుకునేలానే ఉంది.