ఓ పాతిక సినిమాల్లో నటించినా రానంత క్రేజ్ ఒక్క వీడియోతో వచ్చేసింది మలయాళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్‌కి. ఒక్క నైట్‌లోనే సెన్సేషనల్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మకి తొలి సినిమా అంత మంచి బోణీ కాలేదు. వివాదాల్నే మిగిల్చింది. ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి సినిమా 'ఒరు అధార్ లవ్' సినిమాకి సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ ఆమెని స్టార్‌ని చేస్తే, అదే సినిమా విడుదలయ్యాక ఆమె పరువు పోయేలా చేసేసింది. ఎంతగా స్టార్డమ్ సంపాదించిందో, అంతకు మించిన విమర్శల్ని వెనకేసుకోవాల్సి వచ్చింది ఈ సినిమాతో.
ఇకపోతే ఈ క్రేజీ స్టార్ తాజాగా నటిస్తున్న చిత్రం 'శ్రీదేవి బంగ్లా'. బాలీవుడ్లో రూపొందుతోన్న చిత్రమిది. అయితే ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. అతిలోక సుందరి శ్రీదేవి మరణానికి సంబంధించిన కీలకమైన చర్చనీయాంశాలు ఈ సినిమాలో చూపించారని ప్రచారం జరిగిన దర్మిలా ఈ సినిమాని చట్టపరంగా అడ్డుకునేందుకు శ్రీదేవి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. ఆ దిశగా ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీకపూర్ చిత్ర యూనిట్‌కి హెచ్చరికలు కూడా జారీ చేశారట.
దాంతో తొలి సినిమా అలా అయ్యింది. మలి సినిమా పరిస్థితి ఇలా మారిందే అని, ప్రియా ప్రకాష్ వారియర్ స్వయంగా రంగంలోకి దిగి, ఈ సినిమాకీ, శ్రీదేవి జీవిత చరిత్రకీ అస్సలేమాత్రం సంబంధం లేదనీ, ఇదో సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ అంతే.. అని స్పష్టం చేసింది. అయితే టైటిల్ శ్రీదేవి జీవిత చరిత్రకు కనెక్ట్ అయ్యేలా ఉండడమనేది యాదృచ్ఛికమే తప్ప ఆమె కుటుంబ సభ్యులను కించపరచాలన్నది తమ ఉద్దేశ్యం కాదని చిత్ర యూనిట్ తరపున ప్రియా ప్రకాష్ వారియరే వకాల్తా పుచ్చుకుంది.