ఫిబ్రవరి 24.. 2018...ఆదివారం.. బద్దకంగా ఒళ్లు విరుచుకుంటున్న జనాలకు ఓ షాక్‌లాంటి వార్త! అలాంటి వార్త ఒకటి వినాల్సివస్తుందని కలలో కూడా ఊహించలేని కటికల నిజంలాంటి చేదు వార్త. `శ్రీదేవి చనిపోయింది` అంటూ! కళ్లు, మెదడు, మనసూ... మూడూ మొద్దుబారిన క్షణాలవి. ఇదంతా పీడకల అనుకుందామంటే... టీవీలూ, స్క్రోలింగులూ... `ఇదంతా నిజమే` అని చెబుతున్నాయి.
శ్రీదేవి చనిపోవడం ఏమిటి? అసలు శ్రీదేవిలాంటి వాళ్లకూ మరణం ఉంటుందా? అంటూ విస్మయం పొందిన క్షణాలవి. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలాకాలం పట్టింది. పడుతూనే ఉంది. శ్రీదేవి.. ఇవి మూడక్షరాలు కాదు, మూడు దశాబ్దాల పాటు తెలుగువారి గుండెల్ని ఏలిన పేరు.
`సిరి మల్లె పువ్వా.. సిరిమల్లె పువ్వా.. చిన్నారి చిలకమ్మా` అంటూ శ్రీదేవి ఉయ్యాల ఊగుతుంటే.. లక్షలు తనువులు పరవశించాయి. `నా వాడు ఎవడే.. నాతోడు ఎవడే.. ఎన్నాళ్లకొస్తాడే` అంటూ ఆరాలు తీస్తుంటే.. కుర్ర హృదయాలు ఆవురావురు మన్నాయి. అదిగో.. అప్పుడే శ్రీదేవి బొమ్మ మనసుల్లో ముద్రించుకుపోయింది. అప్పటి నుంచీ శ్రీదేవి ఆడినా, పాడినా, నవ్వినా,ఏడ్చినా, బుంగమూతి పెట్టినా - మనసులు మెలితిరిగిపోయాయి.
ఆకు చాటు పిందె తడిసె... అంటూ వానలో స్టెప్పులేస్తుంటే మనకు గిలిగింతలు పెట్టేవి అబ్బనీ తీయని దెబ్బ.. ఎంత కమ్మగా ఉందిరో యబ్బా.. అంటూ ఆ దెబ్బేదో మన మనసుకే తగిలినంత హాయిగా ఉండేది. ఇంద్రలోకం నుంచి భువిపై వాలిన ఇంద్రజ అని అంటే.. నమ్మేశాం. ఆమె నిజంగా దేవకన్యేనేమో అని ఆరాధించాం.
వందల చిత్రాల్లో, హీరోలు మారినా, పాత్రలు మారినా.. శ్రీదేవిని చూడ్డానికే కళ్లను వెండి తెరకు అంకితం చేశాం. వయసు మీద పడుతున్నా, అమ్మ పాత్రల్లోకి మారుతున్నా - శ్రీదేవిపై ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ శ్రీదేవి దూసుకుపోతున్న తరుణంలో..మనల్ని వదిలేసి హఠాత్తుగా మాయమైపోయింది శ్రీదేవి.
ఆమె మరణం సైతం.. థ్రిల్లర్ సినిమాల్లో ట్విస్టుల్లా సాగింది. బాత్ టబ్‌లో మునిగి చనిపోయిన వైనం... ఇప్పటికీ మిస్టరీనే. శ్రీదేవి ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోయింది? అనే విషయాలపై ఇంత వరకూ స్పష్టమైన సమాధానందొరకలేదు. అందుకే శ్రీదేవి ఎప్పుడు గుర్తొచ్చినా.. గుండెలన్నీ మళ్లీ మళ్లీ బరువెక్కుతూనే ఉంటాయి. ఆమె జ్ఞాపకాలతోనే మళ్లీ కాస్త స్వాంతన పడుతుంటాయి.
శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని మరోసారి కోరుకుంటూ...(ఈరోజు శ్రీదేవి తొలి వర్థంతి సందర్భంగా).