మహానాయకుడిపై బజ్‌ క్రియేట్‌ అయ్యేదెలా?

మరిన్ని వార్తలు

'ఎన్టీఆర్‌ మహానాయకుడు' సినిమా వచ్చేస్తోంది. ఎన్నికలకు ముందర సినిమా వచ్చే అవకాశాల్లేవంటూ ప్రచారం జరిగినా, నందమూరి బాలకృష్ణ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌కి సంబంధించి తొలి పార్ట్‌ 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయం చవిచూసిన దరిమిలా, 'ఎన్టీఆర్‌ మహానాయకుడు' విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న బాలయ్య, కొన్ని రీ-షూట్స్‌ కూడా చేయించి, భారీ రేంజ్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేశాడు. 

 

అయితే, సినిమా మీద మాత్రం బజ్‌ క్రియేట్‌ కావడం లేదు. 22వ తేదీ సినిమా రిలీజ్‌ అంటే, గట్టిగా వారం రోజులు కూడా గ్యాప్‌ లేదు. అయినా సినిమా ప్రమోషన్స్‌ ఆశించిన స్థాయిలో స్టార్ట్‌ అవలేదు. మరోపక్క, ఈ రోజు సాయంత్రం 'మహానాయకుడు' ట్రైలర్‌ విడుదల కాబోతోంది. పూర్తిగా ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంపై రూపొందిన సినిమా కావడంతో ప్రస్తుత రాజకీయ వేడి కారణంగా 'మహానాయకుడు'పై ఎంతో కొంత బజ్‌ అయితే క్రియేట్‌ అవ్వాల్సి వుంది. అది ట్రైలర్‌ తర్వాతే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. 

 

అయితే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ట్రైలర్‌ స్థాయిలో 'మహానాయకుడు'లో డ్రామా వుంటుందా.? అన్నది అనుమానమే. ఎందుకంటే, బాలకృష్ణకి చాలా రిజర్వేషన్స్‌ వున్నాయి 'మహానాయకుడు' సినిమాకి సంబంధించి. ప్రధానంగా 'వెన్నుపోటు' అంశాన్ని ప్రస్తావించకపోతే కథలో పస వుండదు. ప్రస్తావించడానికి పరిస్థితులూ అనుకూలించవు. ఇదిలా వుంటే, దర్శకుడు క్రిష్‌ పరిస్థితి మరీ దారుణంగా వుందిప్పుడు. 'మణికర్ణిక' వివాదం, 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' ఫెయిల్యూర్‌ అతన్ని కుంగదీశాయి. ఈ నేపథ్యంలో 'మహానాయకుడు' క్రిష్‌కీ అలాగే బాలయ్యకీ ఎలాంటి ఊపు తెస్తుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS