సుదీర్ఘ విరామం తరవాత పవన్‌కల్యాణ్ మళ్లీ మేకప్ వేసుకున్నాడు. వరుసగా మూడు సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం ఇటీవలే పట్టాలెక్కింది. ఇలా మొదలైందో, లేదో.. అప్పుడే డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో ఓ మంచి బేరం కుదిరినట్టు తెలుస్తోంది. ఈ హక్కుల్ని దాదాపు 60 కోట్లకు అమ్మబోతున్నట్టు టాలీవుడ్ టాక్. ఇందులో హిందీ రైట్స్ కూడా ఉన్నాయి.
ఈ సినిమాకి దాదాపుగా రూ100 కోట్ల బడ్జెట్ కానున్నదని సమాచారం. అందులో 60 శాతం ఇలా.. నాన్ థియేటరికల్ రైట్స్ నుంచే వస్తున్నాయంటే.. పవన్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని అర్థం చేసుకోవొచ్చు. ఒక్క షెడ్యూల్ కూడా అవ్వకుండానే - నిర్మాత చేతికి 60 కోట్లు వచ్చాయి. పవన్ తో సినిమాలు తీద్దామనుకున్న నిర్మాతలకూ, పవన్ అభిమానులకూ ఇంత కంటే శుభవార్త ఏముంటుంది? చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రమిది. విరూపాక్ష అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే.. టైటిల్ మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.