బాలీవుడ్ కి వరుసగా దెబ్బలు మీద దెబ్బలు తగులుతున్నాయి. అక్కడ హిట్ అనే మాట విని చాలా కాలమైంది. స్టార్ హీరోల సినిమాలు సైతం డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి. మరోవైపు సౌత్ లో పుష్ఫ, కేజీఎఫ్, ఆర్.ఆర్.ఆర్ లాంటి ఘన విజయాలు సాధిస్తుంటే, బాలీవుడ్ మాత్రం బోసిబోతోంది. మన సినిమాలే... బాలీవుడ్ లో కాస్త నిలబడి వసూళ్లు అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో హిట్టు పడాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చింది. ఈ వారంపై బాలీవుడ్ గట్టిగా ఆశలు పెట్టుకొంది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ ఈ వారమే విడుదలయ్యాయి. ఈ రెండింటిలో ఒక్కటి హిట్ అయినా మళ్లీ బాలీవుడ్ కాస్త తేరుకుంటుందని భావించారు. అయితే ఈ వారం బాలీవుడ్ ని తీవ్రంగా నిరాశ పరిచింది. వచ్చిన రెండు సినిమాలూ ఫ్లాపులుగా తేలిపోయాయి. దేశ వ్యాప్తంగా వీటి వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి. దాంతో.. బాలీవుడ్ కి మరో ఎదురు దెబ్బ తగిలినట్టైంది.
ఇప్పుడు బాలీవుడ్ ఆశలన్నీ లైగర్ పైనే ఉన్నాయి. ఈనెల 25న లైగర్ వస్తోంది. పూరి - విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందిన సినిమా ఇది. తెలుగుతో పోలిస్తే... హిందీలో ఈ సినిమాకి హైప్ ఎక్కువగా ఉంది. దాంతో పాటు ప్రచారం కూడా గట్టిగా చేస్తున్నారు. హిందీలో ఈసినిమాని మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు లెక్కలేస్తున్నారు. కాస్త యావరేజ్ టాక్ వచ్చినా, బాలీవుడ్ లో భారీ వసూళ్లు తెచ్చుకొనే ఛాన్స్ ఉంది. అందుకే బాలీవుడ్ మొత్తం లైగర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. లైగర్ అక్కడ హిట్టు కొట్టాడంటే - బాలీవుడ్ తేరుకుంటుంది. అదే సమయంలో సౌత్ ఇండియా మానియా బాలీవుడ్ లో మరింత పెరుగుతుంది.