ఈమధ్య పూరి జగన్నాథ్ పాడ్ కాస్ట్ ద్వారా తన భావాల్ని వ్యక్తి పరుస్తున్న సంగతి తెలిసిందే. వీటికి మంచి స్పందన వస్తోంది. పూరి భావాలు డైనమేట్లలా పేలుతున్నాయి. అయితే.. కొన్ని వివాదాస్పదమూ అవుతున్నాయి. ఓ ఎపిసోడ్ లో పేదల గురించి మాట్లాడాడు పూరి. రేషన్‌కార్డులు ఉన్న వాళ్లందరికీ ఓటు హక్కు తొలగించాలని, రేషన్ తీసుకునే వాళ్లకు ఓటు వేసే హక్కు లేదని ఓ ఎపిసోడ్ లో చెప్పాడు. వాటిపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది.
ఈ వ్యాఖ్యలతో పేదల్ని పూరి అవమానించాడని, తక్షణం ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఓ వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. రేషన్ వ్యవస్థనే పూరి అపహాస్యం చేశాడని మండి పడుతోంది. రెక్కాడితే గానీ, డొక్కాడని పేదలకు రేషన్ కనీసం ఒక పూటైనా కడుపు నింపుతోందని, అలాంటి వాళ్లందరినీ పూరి వెటకారం చేశాడని మండి పడుతోంది. రేషన్ తీసుకుంటే ఓటు హక్కు ఎందుకు ఇవ్వకూడదు? అని ప్రశ్నిస్తోంది. పూరికి సమాజంపై గౌరవం లేదని, అందుకే పూరి సినిమాల్ని నిషేధించాలని, ఎవరూ చూడకూడదని మరో వర్గం విమర్శనా గళం విప్పింది. మరి వీటిపై పూరి ఏమంటాడో చూడాలి.