ఎన్నో భారీ అంచనాల మధ్య `రాధే శ్యామ్` విడుదలైంది. ఈ సినిమాకి విడుదలైన రోజునే డివైడ్ టాక్ వచ్చింది. అది స్పైడ్ అవుతూ పోయింది. డివైడ్ టాక్ వచ్చినా, తొలి మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లే అందుకొంది. తొలి మూడు రోజుల్లో అత్యధిక వసూళ్లు సంపాదించిన టాప్ 5 చిత్రాల జాబితాలో రాధే శ్యామ్ కు తప్పకుండా చోటు దక్కుతుంది. అయితే మిగిలిన రాష్ట్రాలలో మాత్రం నెగిటీవ్ రివ్యూల ప్రభావం బాగా కనిపించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. తొలిరోజే అక్కడ వసూళ్లు పెద్దగా కనిపించలేదు. బాహుబలి 2, సాహోకి వచ్చినంత క్రేజ్ ముందు నుంచీ రాధే శ్యామ్ కు లేదు. దానికి తోడు డివైడ్ టాక్ రావడంతో శని, ఆదివారాలు థియేటర్లలో జనసంచారం లేదు. తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ లోనూ ఇదే పరిస్థితి.
బాలీవుడ్‌కి మాస్, మసాలా, కమర్షియల్ సినిమాలంటే ఇష్టం. సౌత్ చిత్రాలంటే ఇవే ఉంటాయని ఫిక్సయ్యారు. బాహుబలి, సాహో, పుష్ప చిత్రాలు ఆడాయంటే అందులో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్సే ప్రధానం. అవేమీ రాధేశ్యామ్ లో మచ్చుకైనా కనిపించలేదు. ప్రభాస్ పర్సనాలిటీకి భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంతా భావించారు. కానీ.. ఇందులో ఒక్క ఫైటూ లేదు. అసలు బలమైన విలన్ లేకపోవడం, సినిమా అంతా జాతకాల చుట్టూ తిరగడం... నార్త్ వాళ్లకు బోర్ కొట్టించేసింది. అందుకే ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. యాక్షన్ డోసు ఎక్కువ ఉన్న చిత్రాలకే బాలీవుడ్ లో చోటన్న సంగతి... రాధే శ్యామ్ తో స్పష్టమైపోయింది.