రాజ్ తరుణ్ కారు ప్రమాదం ఎపిసోడ్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తూ... రోజుకో ట్విస్టు సంతరించుకుంటోంది. కారుని గోడకు గుద్దేసి ఉడాయించిన రాజ్ తరుణ్ - తాను సీటు బెల్టు పెట్టుకున్నాడని, అందుకే సేఫ్‌గా ఉన్నాడని, ఇక మీదట అందరూ సీటు బెల్టు పెట్టుకోవాలని సోషల్ మీడియా సాక్షిగా నీతులు చెప్పాడు. నిజానికి ఆ సమయంలో రాజ్‌తరుణ్ మద్యం సేవించి ఉన్నాడని, అందుకే అక్కడి నుంచి పరారయ్యాడని తెలుస్తోంది.
రాజ్ తరుణ్ కారుని గోడకు గుద్దేసి, అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యాల్ని ఓ యువకుడు సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఆ వీడియో డిలీట్ చేస్తే రూ.5 లక్షలు ఇస్తానని కూడా రాజ్ తరుణ్ ఆఫర్ చేశాడట. అయితే ఆ యువకుడు ఆ ఆఫర్‌ని వద్దనుకున్నాడు.ఈ వీడియో మొత్తం పోలీసులకు చూపించేశాడు. దాంతో రాజ్ తరుణ్ భాగోతం బయటపడింది.
మద్యం తాగుతూ వాహనం నడపడం ఓ నేరం. నడిపి ఓ గొడని గుద్దేసి అక్కడి నుంచి పలాయనం చిత్తగించడం మరో నేరం. ఇవే కాకుండా... పోలీసులకు తప్పుడు సమాచారం అందించడం మరో తప్పు. ఇవన్నీ ఇప్పుడు రాజ్ తరుణ్ మెడకు చుట్టుకునే అవకాశాలున్నాయి. వీటి నుంచి ఈ కుర్ర హీరో ఎలా తప్పించుకుంటాడో మరి.