యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నుండి ప్రమోషన్స్ వేగవంతం అయ్యాయి. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇద్దరి లోకం' విజయం తీసుకువస్తోందా ? ఈ సినిమా హిట్ అయితేనే రాజ్ తరుణ్ కెరీర్ నిలబడుతుంది. ఎందుకంటే గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో.
ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయినట్లు, హీరోయిన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అర్జున్ రెడ్డికి హీరోయిన్ గా బోల్డ్ క్యారెక్టర్ తో రెచ్చిపోయిన షాలినీ పాండేకు మాత్రం ఆ సినిమా తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఒకవిధముగా అర్జున్ రెడ్డి తరువాత ఆమెకు హీరోయిన్ గా సరైన సినిమానే లేదు. మరి ఈ సినిమాతోనైనా రాజా తరుణ్ కి షాలినీ పాండేకు మంచి హిట్ వస్తోందేమో చూడాలి. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.