బాహుబలి ఎవరంటే.. ప్రభాస్ అనే పేరే వినిపిస్తుంది. ఆ బాహుబలిని సృష్టించిన రాజమౌళి కూడా... బాహుబలినే. ఆ మాటకొస్తే నిజమైన బాహుబలి.. రాజమౌళినే. సినీ ప్రపంచం అంతా అదే నమ్ముతోంది.. అదే నిజం కూడా!!
రాజమౌళి సినిమాల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. సినిమా టికెట్టు కొనడం, థియేటర్లో కూర్చోవడం వరకే ప్రేక్షకుడికి గుర్తుంటుంది. ఆ తరవాత మనల్ని ఆవాహన చేసుకొంటాడు రాజమౌళి. ఏదో మంత్రం వేస్తాడు. తన మాయలో పడేస్తాడు. రాజమౌళి సినిమాకెళ్తే.. హీరోని పిచ్చపిచ్చగా ఆరాధించడం మొదలెడతాం. హీరోయిజంలో ఇంత కిక్కుందా అనిపిస్తుంది. ఒక్కోసారి ఆ దేవుడు కంటే హీరోనే బలవంతుడు అనిపిస్తుంది. అలా నమ్మించగలడు. అదే రాజమౌళి బలం.
రాజమౌళి సినిమాల్లో హీరోకి రెండు పార్శ్వాలుంటాయి. స్టూడెంట్ నెంబర్‌వన్, సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు.. ఇలా ఏ సినిమా అయినా తీసుకోండి. ఆ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పార్శ్వం విలన్‌కో, పరిస్థితులకో లోబడి తలవొంచేది. మరోటి... ఆకాశాన్ని సైతం కిందకు దించే... పవర్! రాజమౌళి సినిమాలో చివరి వరకూ విలన్‌దే ఆధిపత్యం! కానీ ఏదో ఓసారి హీరో తిరగబడతాడు. తోలు తీస్తాడు. అదీ మామూలుగా ఉండదు.. మాస్‌కి పూనకం వచ్చి ధియేటర్లోనే ఊగేస్తుంటారు.
రాజమౌళికీ, ఈనాటి మిగిలిన దర్శకులకీ తేడా ఏంటంటే, చాలామంది హీరోల కోసం వెదుతుతారు.రాజమౌళి మాత్రం హీరోల్ని సృష్టించుకొంటాడు. మర్యాద రామన్న, ఈగ అందుకు సాక్ష్యాలు. సినిమా తప్ప మరో ప్రపంచం తెలీదంటారు రాజమౌళికి. ఆయనతో పనిచేసిన వాళ్లు, చేస్తున్నవాళ్లూ ఇదే చెప్తారు. సినిమాలో పడి, అందులో మునకేసి, అదే కలకంటూ... కన్నకలని సినిమాగా తీస్తూ.. షాక్‌ల మీద షాక్‌లిస్తున్నాడు జక్కన్న!
బాహుబలితో ఆయన ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైంది. అందుకే అతని వంక ఆశగా ఎదురుచూస్తోంది. ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో అని. ఇంకెంత మాయ చేస్తాడో అని. ఇప్పుడు ఎన్టీఆర్ - రామ్‌చరణ్‌లతో ఓ మల్టీస్టారర్ రూపొందిస్తున్నాడాయన. ఈ చిత్రం మరో అద్భుతానికి తెర లేపాలి. అలాంటి రోజు కోసం ఎదురుచూస్తూ... జక్కన్నకు జన్మదిన శుభాకాంక్షలు.