ఈమధ్య క్రేజీ చిత్రాలు `నిడివి` సమస్యతో అల్లాడుతున్నాయి. డియర్ కామ్రేడ్ సినిమా కి లెంగ్త్ ఎక్కువైందన్న విమర్శలు వచ్చాయి. సాహోకి కూడా ఇదే సమస్య. సినిమాని ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది అంటున్నారంతా. ఈ రన్ టైమ్ ఇబ్బంది తన సినిమాకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు రాజమౌళి. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో తెరకెక్కిస్తున్న `RRR రన్ టైమ్ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు టాక్. ఈ సినిమా రన్ టైమ్ 2గంటల 30 నిమిషాల లోపే అని తెలుస్తోంది. అంతే కాదు.. ఈ కథలో కేవలం మూడు పాటలకే చోటిచ్చాడట. మరో పాట కూడా ఉంటుందని, కానీ అది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రూపంలో వస్తుందని తెలుస్తోంది.
సినిమా అంతా తీసేశాక, అప్పుడు ట్రిమ్ చేసుకోవడంలో ఎలాంటి లాభం ఉండదు. డబ్బులు, సమయం చాలా వృధా అవుతాయి. అందుకే స్క్రిప్టు దశలోనే తొలగించాల్సిన అంశాలపై రాజమౌళి దృష్టి పెట్టాడని సమాచారం. పెద్దగా ప్రభావం చూపించవు అనుకున్న సీన్లను ముందే తొలగించాడని, పాటలు తక్కువ ఉండేలా చూసుకోవడం వల్ల... బడ్జెట్ కంట్రోల్‌లోకి వచ్చిందని తెలుస్తోంది. అలా రన్ టైమ్‌నీ, బడ్జెట్‌నీ రెండింటినీ అదుపులో పెట్టుకుంటున్నాడన్నమాట.