'మా' డైరీ ఆవిష్కరణలో భాగంగా హీరో రాజశేఖర్ సభా వేదికపై చేసిన రసాభాస ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ, 'మా' ఉపాధ్యక్ష్య పదవికి రాజీనామా చెబుతూ, తన కారణంగా సభ రసాభాస జరిగినందుకు పెద్దల్ని క్షమించాలని కోరారు. పెద్దలు మోహన్‌బాబు, చిరంజీవి ఎంత వారించినా ఆగకుండా, మైకు లాక్కొని మరీ తనకు తోచింది మాట్లాడేసిన రాజశేఖర్ తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రచ్చ అనంతరం మోహన్‌బాబు, చిరంజీవి ఉపన్యాసాలతో మళ్లీ సభ సరదా సరదాగా సజావుగానే సాగిందనుకోండి. అయితే, సభలో తన ప్రవర్తన పట్ల రియలైజ్ అయిన రాజశేఖర్ సభా పెద్దల్ని క్షమాపణలు కోరారు.
చిరంజీవితో కానీ, మోహన్‌బాబుతో కానీ తనకెలాంటి విబేధాల్లేవ్ అనీ, 'మా'కు వారు చేసిన సేవలు ప్రశంసించదగ్గవనీ, ఆ విషయంలో వారి పట్ల తనకెప్పుడూ అపారమైన గౌరవం ఉంటుందనీ ఆయన స్పష్టం చేశారు. కానీ, మా అధ్యక్షుడైన నరేష్‌తో తనకు డిఫరెన్సెస్ ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే 'మా'తో కూడా తనకు గొడవలే అని తేల్చేశారు. ఇకపై 'మా'లో తాను అడ్జస్ట్ కాలేననీ, ఇండస్ట్రీకి ఎలాంటి సేవ చేయాలన్నా, సొంతంగానే చేస్తాను తప్ప, 'మా'తో కలిసి పని చేయలేనన్నట్లుగా రాజశేఖర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.