రాజకీయాల్లోకి సినీ నటులు వెళుతోంటే, 'అయ్యోపాపం..' అనాల్సి వస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. రజనీకాంత్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న విషయం విదితమే. డిసెంబర్ 31న ఈ విషయమై రజనీకాంత్ నుంచి అధికారిక ప్రకటన రాబోతోంది. పార్టీ పేరు, గుర్తు.. ఇప్పటికే ఖరారయినా, వాటిని అధికారికంగా ప్రకటించలేదు. అవన్నీ జనవరిలో ప్రకటితమవుతాయట.
ఇదిలా వుంటే, ఈ రోజు రజనీకాంత్ పుట్టినరోజు నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. మరి, రాజకీయాల్లోకి వచ్చాక కూడా రజనీకాంత్ పట్ల ఆయా ప్రముఖుల్లో అభిమానం ఇలానే వుంటుందా.? అన్నదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే. రాజకీయాల్లోకి వెళితే, మిత్రులు శతృవులైపోతారన్నది జగమెరిగిన సత్యం. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పటికే ఆ 'రుచి' చూసేశారు.
తమిళ సినీ పరిశ్రమలో చాలామంది ఇలాగే రాజకీయాల్లోకి వెళ్ళి నష్టపోయారు. ఆ కారణంగానే రజనీకాంత్ ఆచి తూచి అడుగులేశారు. లేకపోతే, ఎప్పుడో ఆయన రాజకీయాల్లోకి వచ్చేసేవారే. ఇప్పుడాయన రాజకీయాల్లోకి వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది. ఇక, రజనీకాంత్ స్నేహితుడు, విశ్వనటుడు కమల్ హాసన్ గురించి అందరికీ తెల్సిందే. రాజకీయాల్లోకి వెళ్ళాక, కమల్‌కి మిత్రుల కంటే శతృవులు ఎక్కువైపోయారు. రాజకీయం అంటేనే అంత. మరి, రజనీకాంత్ పరిస్థితి ఏమవుతుందో.!