రజనీకాంత్ చుట్టూ రాజకీయాలు అనే పాయింట్ కూడా నడుస్తుంటుంది. రజనీ ప్రస్తావన ఎప్పుడొచ్చినా- రాజకీయాల్లోకి ఎప్పుడొస్తాడు? వస్తే.. గెలిచే అవకాశాలేంటి? అనే విషయాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంటుంది. ఇన్నాళ్లు కామ్‌గా ఉన్న రజనీకాంత్ ఇప్పుడిప్పుడే రాజకీయ రంగంపైపు దృష్టి సారిస్తున్నారు. ఈమధ్య తన అభిమానులతో వరుసగా మీటింగులు ఏర్పాటు చేశారు.
రజనీ హడావుడి చూస్తుంటే రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అనే సంకేతాలు కనిపించాయి. ఓ టీవీ ఛానల్ ఏర్పాటు చేయడానికి కూడా ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తేలడంతో.. రేపో - మాపో రజనీ పార్టీ ప్రకటన ఖాయం అనుకున్నారు. ఈ లోక్ సభ ఎన్నికలలో రజనీ పోటీ చేస్తారని ఆశించారు. కానీ రజనీకాంత్ ఈ లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడం లేదని స్పష్టం చేయడంతో రజనీ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
రజనీ పార్టీ ఈ లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసినట్టైతే... అధికార పక్షానికి బలమైన పోటీ ఇచ్చేది. కానీ రజనీ అందుకు ఇంకా సన్నద్ధం కాలేదని తెలుస్తోంది. పైగా ఏ పార్టీకీ తను మద్దతు ఇవ్వబోవడం లేదని రజనీ స్పష్టం చేయడంతో - రజనీ ఇంకా మీన మేషాలు లెక్కేస్తున్నట్టే అనిపిస్తోంది. ఈమాత్రం దానికి ఫ్యాన్స్ మీటింగుల పేరుతో హడావుడి చేయడం ఎందుకు? అనేది అభిమానుల మాట. చాలా ఏళ్లుగా రజనీ రాజకీయాల్లోకి వస్తా వస్తా అంటూ ఊరిస్తూనే ఉన్నాడు. కానీ.. అందుకు సరిపడ కార్యచరణ వైపు మాత్రం దృష్టి పెట్టడం లేదు. మరి ఎన్నాళ్లిలా నచ్చుతాడో??