తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి కొత్త తలనొప్పి వచ్చింది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన రజనీకాంత్ వెంట నడిచేందుకు పలువురు తమ తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడానికీ వెనుకాడ్డంలేదు. రజనీకాంత్ కొత్త సినిమా చూసేందుకే, ఉద్యోగాన్ని సైతం లెక్కచేయని అభిమానులున్నారు. అదీ 'తలైవా' గ్రేట్‌నెస్. ఆయనకున్న క్రేజ్‌ని అభివర్ణించడానికి మాటలు చాలవు. అలాంటి రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడితే అభిమానులు ఊరుకుంటారా? 'మీరు, హ్యాపీగా ఉండండి - మొత్తం మేం చూసుకుంటాం' అని సూపర్ స్టార్‌కి భరోసా ఇస్తున్నారు అభిమానులు.
ఈ భరోసా రజనీకాంత్‌లో ఆనందాన్ని నింపుతున్నా, తన అభిమానులు రాజకీయ ఆలోచనలతో తమ తమ ఉద్యోగాల్ని, వ్యాపకాల్ని వదులుకోవడం రజనీకాంత్‌కి ఇష్టం లేదట. మీ విధుల్లో మీరు కొనసాగుతూనే, నాకు మద్దతివ్వండంటూ అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. 'రోబో 2.0' నిర్మాణ బాధ్యతల్ని దగ్గరుండి చూసుకున్న రాజు మహాలింగం, ఆ బాధ్యతలకు రాజీనామా చేసి రజనీకాంత్ వెంట నడవనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. తమిళనాడులోనూ, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ వివిధ ఉద్యోగాలు చేస్తోన్న 'డై హార్డ్ ప్యాన్స్' తమ తమ వ్యాపకాల్ని వదులుకోవడానికి పదుల సంఖ్య సిద్దంగా ఉన్నారని ఓ అంచనా.
వీరందర్నీ ఉద్దేశించి త్వరలో రజనీకాంత్ ఇంకోసారి అప్పీల్ చేయబోతున్నారట. అలాగే వారిని కలిసి మాట్లాడాలని, తన రాజకీయ ఆలోచనల్ని వారితో పంచుకోవాలనీ రజనీకాంత్ అనుకుంటున్నారనీ సమాచారమ్. రజనీకాంత్ పిలవాలేగానీ, ప్రత్యేక విమానాల్లో వచ్చేసేవారెంతోమంది విదేశాల్లో ఉన్నారు. అదే రజనీకాంత్ ఫ్యాన్ పవర్.